పిడకల సమరం..కర్నూలు జిల్లాలో వింత ఆచారం!

New Update
పిడకల సమరం..కర్నూలు జిల్లాలో వింత ఆచారం!

త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది. పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తమ భద్రకాళి దేవిని వీరభద్ర స్వామి మోసం చేశారని అమ్మ వారి భక్తులు నమ్మి వీరభద్ర స్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకొన్న వీరభద్ర స్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్ర స్వామిని వెళ్లవద్దని వేడుకొన్నారని స్థానికులు అంటున్నారు. స్వామి భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని, అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామి వారిపై పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు.

ఈ విషయం తెలుసుకున్న స్వామి వారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగారని, అలా ఇరువర్గాలు పిడకల సమరం సాగించారని అంటుంటారు. వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయాన్ని విశ్వకర్మ (భద్రకాళి అమ్మ వారి తండ్రి) బ్రహ్మదేవునికి చెప్పారని, బ్రహ్మ దేవుడు వీరభద్ర స్వామి తండ్రి శివుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లారని, అనంతరం బ్రహ్మ దేవుడు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారని అంటుంటారు.

పిడకల సమరంలో దెబ్బలు తగిలినవారు భద్రకాళి అమ్మవారు, వీరభద్ర స్వామి వార్ల ఆలయాలకు వెళ్లి నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న విభూతిని ఇరువర్గాల భక్తులు రాసుకుని రావాలని బ్రహ్మ ఆదేశించాడని, ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కల్యాణం జరిపిస్తామని బ్రహ్మ దేవుడు మాట ఇచ్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. స్వామి వార్లను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే వారు పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించేలా చూడాలని కూడా బ్రహ్మ దేవుడు భక్తులను కోరాడట. అందుకు సమ్మతించిన భక్తులు బ్రహ్మ దేవుడ్ని కైరుప్పల గ్రామం పక్కన ఉన్న కారుమంచి గ్రామంలోని ఒక రెడ్ల కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించేలా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెబుతారు.

అలా ప్రతి ఏటా ఉగాది ఉత్సవాలలో భాగంగా స్వామి వార్ల పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారుమంచి గ్రామం నుంచి ఒక రెడ్డి కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం గుర్రంపై కైరుప్పల గ్రామానికి ఊరేగింపుగా చేరుకొంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. వారి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్థులు ఇరువర్గాలగా విడిపోయి పిడకలతో కొట్టుకొంటారు.

ఇలా కొట్టుకోవడం ఒక సంప్రదాయం అని భక్తులు అంటున్నారు. పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు ఆలయానికి వెళ్లి స్వామి వార్లకు నమస్కారం చేసుకొంటారు. అక్కడ ఉన్న విభూతిని దెబ్బలు తగిలిన చోట వేసుకొని ఇళ్లకు వెళ్లిపోతారు. పిడకల సమరం ముగిసిన మరసటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి, వీరభద్ర స్వామి వారికి అంగరంగ వైభవంగా కల్యాణం జరిపిస్తారు. అయితే ఈ పిడకల సమరానికి కైరుప్పల గ్రామం మరోసారి సిద్ధమైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు