Haryana Judge: డేటింగ్ యాప్ లో మహిళా జడ్జి : రూ. 52 లక్షలు కొట్టేశాడు... ట్విస్ట్ ఏంటంటే!

బీహార్‌కు చెందిన ఒక మహిళా జడ్జి టిండర్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి చేతిలో రూ. 52 లక్షలకు పైగా మోసపోయారు. ఈ కేసులో నిందితుడు దీపక్ వాట్స్‌కు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించింది.

New Update
Haryana Judge

Haryana Judge

Haryana Judge: బీహార్‌కు చెందిన ఒక మహిళా జడ్జి టిండర్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి చేతిలో రూ. 52 లక్షలకు పైగా మోసపోయారు. ఈ కేసులో నిందితుడు దీపక్ వాట్స్‌కు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నిరాకరించింది. నిందితుడు జడ్జి నుండి భారీగా డబ్బులు వసూలు చేసి, ఇప్పుడు దర్యాప్తుకు సహకరించకుండా కీలకమైన ఫోన్ ఆధారాలను దాచేస్తున్నాడని కోర్టు పేర్కొంది. ఆన్‌లైన్ ప్రేమ పేరుతో అమాయకులను వలలో వేసుకునే ఒక పక్కా హనీ ట్రాప్ లాగా ఈ వ్యవహారం కనిపిస్తోందని జడ్జి అభిప్రాయపడ్డారు.

గతేడాది నవంబర్‌లో టిండర్ యాప్‌లో నిందితుడు జడ్జికి పరిచయమయ్యాడు. తన పేరు "అభిమన్యు వశిష్ఠ్" అని, తాను ఒక రహస్య ప్రభుత్వ విభాగంలో పెద్ద ఆఫీసర్‌ని అని అబద్ధాలు చెప్పి ఆమెతో నమ్మకంగా బంధాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఆమె చేత తన బ్యాంక్ ఖాతాల్లోకి ఏకంగా రూ. 52 లక్షలకు పైగా బదిలీ చేయించుకున్నాడు. అయితే చెప్పినట్లుగా ఎలాంటి లాభాలు రాకపోగా, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి ఇవ్వకుండా మొహం చాటేయడంతో తాను మోసపోయానని సదరు జడ్జి గ్రహించారు.

పనిమనిషి పేరుతో కేసు

అయితే, ఈ కేసులో ఒక విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలైన జడ్జి తన పేరుతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, సమాజంలో వచ్చే అవమానానికి భయపడి తన ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరుతో కేసు పెట్టించారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా తనను ఎవరో మోసం చేశారంటూ ఆ పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ కోర్టు ఈ లావాదేవీలను పరిశీలించినప్పుడు, డబ్బులన్నీ జడ్జి బ్యాంక్ ఖాతాల నుంచే వెళ్లాయని తేలింది. జడ్జిగా ఆమెకు ఉండే ఇబ్బందులను అర్థం చేసుకోగలమని, కానీ ఆ కారణంతో అసలు నిజాలను దాచిపెట్టి దర్యాప్తును పక్కదారి పట్టించడం సరికాదని కోర్టు తప్పుబట్టింది.

ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరుపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడు, బాధితురాలైన జడ్జి, అలాగే కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి.. ఈ ముగ్గురూ కూడా కీలకమైన సమాచారాన్ని, వాట్సాప్ చాటింగ్‌లను దాస్తూ నిజాన్ని మరుగున పడేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు తనకు అనుకూలంగా ఉండే విషయాలు మాత్రమే చెబుతూ పోలీసులతో కళ్లుమూతల ఆట ఆడుతున్నాడని మండిపడింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున, మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని చెబుతూ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

Advertisment
తాజా కథనాలు