తెలుసుకో కస్తూరి.. తెలుగు, తమిళ ప్రజల అనుబంధం ఇది!

నటి కస్తూరి అన్నట్లు.. నిజంగా అంతఃపుర మహిళలకు సేవ చేయడానికే తెలుగువారు తమిళనాడుకు వచ్చారా? ఆమె వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా? అసలు తెలుగు ప్రజలు, తమిళుల బంధం ఎప్పటి నుంచి మొదలైంది? ఇప్పుడు ఎలా కొనసాగుతోంది? అక్కడ మనవారు ఎంత మంది ఉన్నారు? వివరాలు ఈ స్టోరీలో..

author-image
By Nikhil
New Update
Tamilnadu AP

300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు ప్రజలు తమిళనాడుకు వచ్చారు.. నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి ఆదివారం చెన్నైలో జరిగిన ఓ మీటింగ్ లో చేసిన వివాదాస్పద కామెంట్స్ ఇవి. ఇంతటితో ఆగకుండా.. అలా వచ్చిన వాళ్లు ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే.. ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ ఫ్యామిలీని టార్గెట్ చేసే ఆమె ఈ కామెంట్లు చేశారన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. స్టాలిన్ పూర్వికులు ఏపీ నుంచే వచ్చారన్న ప్రచారం ఉంది. దీంతో వీరు తమిళులు కాదు తెలుగువారు అంటూ చిత్రీకరించే క్రమంలో కస్తూరి ఇలా మాట్లాడారన్న చర్చ సాగుతోంది. అయితే.. కస్తూరికి చరిత్ర తెలియదని, తెలుగు, తమిళ ప్రజల మైత్రిపై ఆమెమెకు అవగాహన లేదని సోషల్ మీడియాలో నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

క్రీస్తుపూర్వం నుంచే..

తెలుగు, తమిళుల బంధం ఈనాటిది కాదు. క్రీస్తుపూర్వం నుంచే తెలుగు వారు తమిళ ప్రాంతాలకు వెళ్ళారని చరిత్ర చెబుతోంది. తమిళ నాడుకు తెలుగువారి వలస పల్లవుల రాజ్యపాలన కాలం నుంచి ఉంది. 13వ శతాబ్దంలో కాకతీయులు తమిళ నాడును పరిపాలించారు. తమిళనాట చోళ వంశం, తెలుగు రాజ్యమేలుతున్న చాళుక్య వంశం వియ్యం కూడా అందుకోవడంతో రాకపోకలు మరింతగా పెరిగాయి. ఆ తర్వాత కాకతీయుల కాలంలో తమిళ రాజ్యంలో తెలుగు రాజ్యానికి మంచి బేస్ ఏర్పడింది.15వ శతాబ్దంలో కృష్ణదేవరాయల పరిపాలనలో తమిళనాడులో తెలుగు వారికి 'తెలుగు వారికి స్వర్ణయుగం'గా ఉందని చెబుతుంటారు. తంజావూరును ఏలిన మరాఠా రాజ వంశీయులైన 'సాహాజీ'లు సైతం వారే కవులుగా మారి తెలుగులో యక్షగానాలు రచించడం విశేషం. తంజావూరులోని సరస్వతీ గ్రంథాలయాన్ని తెలుగువారి సారస్వత భాండాగారంగా చెబుతుంటారు. తెలుగు ప్రాంతాల నుంచి తమిళనాడుకు ప్రజలు వలస వెళ్లి అక్కడి సంస్కృతి, నాగరికత అభివృద్ధిలో పాలు పంచుకున్నారు తప్పా.. కస్తూరి చెప్పినట్లు అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదు. 

ఇండిపెండెన్స్ తర్వాత..

భారత స్వాతంత్ర్యం తరువాత, మద్రాస్ ప్రెసిడెన్సీ 1947 ఆగస్టు 15 న మద్రాస్ ప్రావిన్స్ అయ్యింది. 1950 జనవరి 26 న భారత ప్రభుత్వం దీనిని మద్రాస్ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. మద్రాసు రాష్ట్రంలో ప్రస్తుత తమిళనాడు రాష్ట్రం, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర కేరళలోని మలబార్ ప్రాంతం, దక్షిణ కెనరాలోని బళ్లారి భాగంగా ఉండేవి. అనంతరం పొట్టి శ్రీరాముల పోరాటంతో 1953 నవంబర్ 1న ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దక్షిణ కెనరా, బళ్లారి జిల్లాలను మైసూర్ రాష్ట్రంతో మలబార్ జిల్లాను ట్రావెన్కోర్-కొచ్చిన్ రాష్ట్రంలో విలీనం చేసి 1956లో కేరళను ఏర్పాటు చేశారు. 1969 జనవరి 14 న మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్చింది నాటి భారత సర్కార్. ప్రస్తుతం తమిళనాడులోని చెన్నై, వెల్లూరు, క్రిష్ణగిరి, తిరువల్లూరు, తిరువన్నమలై, ధర్మపురి, కోయంబత్తూరు, సేలం తదితర ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో తెలుగువారు కనిపిస్తారు. 

NTR MGR

తెలుగు సినిమాకు కేరాఫ్ చైన్నై!

ఇప్పటికీ పాత నటీ నటుల ఇంటర్వ్యూలు చూస్తే.. వారు తమ చెన్నై చరిత్రను చెబుతూ ఉంటారు. తాము రైలెక్కి చెన్నై ఎలా వెళ్లామో వివరిస్తూ ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, కృష్ణ నుంచి చిరంజీవి వరకు అందరూ చెన్నై నుంచే తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడ సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. నాగార్జున, వెంకటేశ్ నుంచి మహేశ్‌ బాబు, రామ్ చరణ్‌ వరకు అనేక మంది హీరోల బాల్యం అంతా చెన్నైలోనే గడిచింది. ఎన్టీఆర్ తో పాటు అనేక మంది హీరోలు, నటీనటులు, టెక్నీషియన్స్ ఆస్తులు ఇంకా చెన్నైలోనే ఉన్నాయి. మన మీడియా ఇప్పటికీ చెన్నై వెళ్లి ఇదే ఎన్టీఆర్ అప్పట్లో నివాసం ఉన్న ప్రాంతం, చిరంజీవి తొలి ఇళ్లు ఇదే అంటూ చూపిస్తూ ఉంటుంది. 1970 నుంచి తెలుగు సినిమా హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతూ వచ్చింది.

chiranjeevi-rajinikanth

అనేక మంది ఇండస్ట్రీ పెద్దలు ఇంకా అక్కడే..

అయినా.. కూడా బాలసుబ్రమణ్యం లాంటి దిగ్గజ గాయకులు, గొల్లపూడి మారుతీరావు లాంటి ప్రముఖులు చెన్నై లోనే చివరిదాకా ఉండిపోయారు. డ్యాన్స్, ఫైట్ మాస్టర్లు సైతం అనేక మంది చెన్నై నుంచే హైదరాబాద్ కు వచ్చిపోతుంటారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు దేవిశ్రీప్రసాద్, తమన్ ఫ్యామిలీలు, వారి రికార్డింగ్ స్టూడియోలు ఇంకా చెన్నైలోనే ఉన్నాయి మణిశర్మ కుటుంబం కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇటీవల చెన్నైలోని ఓ వీధికి బాలసుబ్రమణ్యం పేరు పెట్టారంటే వారు మన గాన గంధర్వుడిని ఎలా గౌరవించారో అర్థం చేసుకోవచ్చు. తమ పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా ఇళయదళపతి విజయ్ సైతం తనకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో పాటు, ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ తనకు ఆదర్శమని చెప్పి తెలుగు నటులు, నేతలపై గౌరవాన్ని చాటారు.

తమిళ హీరోలకు తెలుగులో మంచి మర్యాద..

తమిళమీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, ధనుష్, విక్రమ్ తదితరులకు తెలుగు హీరోలతో సమానమైన క్రేజ్ ఉంటుంది. అభిమానులు కూడా వారికి ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ఉంటారు. తెలుగు సినిమాలతో పోటీ పడి మరీ వారి సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిసిన సందర్భాలు అనేకం. అయినా.. ఇక్కడి ఇండస్ట్రీ వారిపై ఎప్పుడు ఎలాంటి ద్వేషం చూపించలేదు. ఇంకా మన హీరోలు వారి సినిమా ప్రమోషన్లకు వెళ్లి ప్రచారం కల్పిస్తూ ఉంటారు. రజినీకాంత్, కమల్ హాసన్ తదితరులు తెలుగులో స్ట్రెయిట్ సినిమాలను కూడా చేశారు. 

తమిళనాడులో 60 లక్షల మంది తెలుగు వారు ..

తమిళనాడులో తెలుగు మాట్లాడే వారు దాదాపు 50 లక్షల మంది ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారని బీజేపీ నాయకురాలు కస్తూరి వ్యాఖ్యానించారు. అయితే.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు తెలుగు మాట్లాడగలిగే వారు తమిళనాడులో ఉన్నారు. ప్రస్తుత సీఎం స్టాలిన్ పై ఏఐడీఎంకే నుంచి పోటీ చేసిన రాజారాం కూడా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తే కావడం విశేషం. తెలుగు మూలాలున్న బాలకృష్ణారెడ్డి ఏఐడీఎంకే నుంచి విజయం సాధించి మంత్రిగా కూడా పని చేశారు. హోసూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్‌కు చెందిన మరో తెలుగు వ్యక్తి గోపీనాథ్ కూడా విజయం సాధించారు. ఇక్కడ 30-40 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమైన నేతలు అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తూ ఉంటారు. పవన్ కల్యాణ్ తో పాటు కిషన్ రెడ్డి, లోకేష్ తదితర 20 మంది తెలుగురాష్ట్రాల ముఖ్య నేతలు తమిళనాడు వెళ్లి ప్రచారం చేశారు.

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ..

తమిళనాడులోని కృష్ణగిరి నుంచి ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన గోపినాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి తెలుగు భాషపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తన ప్రమాణం చివరలో ‘జై తమిళనాడు’  అని ముగించారు. ఆయన నియోజకవర్గం కృష్ణగిరి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఏపీకి అత్యంత సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గంలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషలు మాట్లాడే ప్రజలు ఉంటారు. తన మాతృభాషను కాపాడుకోవడానికి గోపీనాథ్ ఎప్పుడూ ముందు ఉంటారు. గతంలో హోసూరు నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచిన గోపినాథ్ అసెంబ్లీలోనూ తెలుగులో మాట్లాడి మాతృభాషపై తన మక్కువ చాటారు.  మాత్రం తన మాతృభాష తెలుగు కోసం పోరాడుతూనే ఉంటారు.

తెలుగులో మాట్లాడిన జయలలిత..

జయలలిత సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వం తమిళాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తూ ఓ చట్టం తీసుకొచ్చింది. దీంతో అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న గోపినాథ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనార్టీ భాషలను చంపొద్దని కోరారు. ప్రజలు తమ మాతృభాషలో చదువుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనకు ఆన్సర్ చెప్పే క్రమంలో నాటి సీఎం జయలలిత సైతం తెలుగులోనే మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. తెలుగు భాషను కాపాడతానని హామీ ఇచ్చారు.

           

బీజేపీకి బూమ్ రాంగ్..

తమిళనాడులో తెలుగు, తమిళుల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని భావించి కస్తూరి చేసిన కామెంట్స్ బీజేపీకి తలనొప్పిగా మారాయన్న చర్చ సాగుతోంది. తెలంగాణ, ఏపీలో సొంతంగా ఎదిగి అధికారం దక్కించుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ ఎదిగేందుకు అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఆ తర్వాత ఏపీ మాత్రమే. అయితే.. తెలుగు వారిని కించపరుస్తూ తమిళనాడు బీజేపీ నాయకురాలు కస్తూరి చేసిన వ్యాఖ్యలతో ఇక్కడ నష్టం జరుగుతుందన్న చర్చ సాగుతోంది. ఈ వ్యాఖ్యలను ఇక్కడ ఇతర పార్టీల నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తే తమకు ఇబ్బంది తప్పదని ఆ పార్టీ భావస్తోంది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో కస్తూరిపై  తెలంగాణకు చెందిన  బీజేపీ నేత, తమిళనాడు సహా ఇన్ చార్జి,పొంగులేటి సుధాకర్ ఫైర్ అయ్యారు. కస్తూరి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. ఆమె యధాలాపంగా ఆ వ్యాఖ్యలు చేశారా? లేక మరెవరైనా ఆమెతో అలా చెప్పించారా? అన్న విషయం తెలియాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

మాట మార్చిన కస్తూరి..

భారీగా విమర్శలు రావడం కస్తూరి సైతం వెనక్కు తగ్గారు. అలా అనలేదంటూ తన ఎక్స్ ఖాతా నుంచి వరుస పోస్టులు చేశారు. డీఎంకే పార్టీ తన వ్యాఖ్యలను వక్రీకరించిందంటూ ఆరోపించారు. తన మెట్టినిల్లు తెలుగు, తన ఫ్యామిలీ తెలుగువాళ్లు అని తెలియని ఈ ఇడియట్స్ ఇలా చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలు తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు