/rtv/media/media_files/2026/05/11/jayalilitha-2026-05-11-14-35-41.jpg)
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ఆరంభమైంది. సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అధికారంలోకి వచ్చింది. విజయ్ తన టీమ్‌ను చాలా వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. 8 మంది మంత్రులతో కూడిన చిన్న కేబినెట్‌లో అనుభవానికి పెద్దపీట వేశారు. సీనియర్ నేత కె.ఎ. సెంగోట్టయ్యన్ కు మంత్రిగా అవకాశం ఇచ్చారు. గోపిచెట్టిపాలయం నియోజకవర్గం నుంచి సెంగోట్టయ్యన్ ఏకంగా 11 సార్లు గెలిచారు. ఇప్పుడు విజయ్ కేబినెట్ లో ఈయనే సీనియర్ మంత్రి.
ఏఐఏడీఎంకేలో దశాబ్దాల పాటు వెన్నెముకలా నిలిచిన నేతగా సెంగోట్టయ్యన్ పేరుంది. జయలలిత కేబినెట్‌లో అత్యంత నమ్మకస్తుడైన మంత్రిగా పనిచేశారు. అయితే 2026 ఎన్నికలకు ముందు AIADMK నుంచి బహిష్కరణకు గురైన ఆయన, గత ఏడాది TVKలో చేరారు. TVK నుంచి పోటీ చేసి గెలిచిన సెంగోట్టయ్యన్ కు విజయ్ తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు.
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం
తమిళనాడు అసెంబ్లీలో నేడు నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. సీఎం విజయ్ ప్రమాణం చేసిన అనంతరం మంత్రుల వంతు వచ్చింది. అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సెంగోట్టయ్యన్ తన చొక్కా జేబులో జయలలిత ఫోటోతో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. "జెండా మారినా.. నా గుండెల్లో ఉండే అజెండా అమ్మ మాత్రమే అని ఆయన తన చర్య ద్వారా మౌనంగానే చాటిచెప్పారు.
సాధారణంగా ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీ నాయకుల ఫోటోలను ప్రదర్శించడం పార్టీ క్రమశిక్షణాచర్యలకు వ్యతిరేకం. కానీ, తన కేబినెట్‌లోని ఒక సీనియర్ మంత్రి తన మాజీ నాయకురాలి ఫోటోను జేబులో పెట్టుకోవడానికి సీఎం విజయ్ అంగీకరించడం విశేషం. ఇది విజయ్ రాజకీయ పరిణతిని, సీనియర్ల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తనదైన మార్కు పాలనను ప్రారంభించారు. కీలకమైన మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళల రక్షణ కోసం షీ టీమ్, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు.
Follow Us