ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి నుంచి రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అయితే ఆప్ ఈ ఆరోపణను ఖండించింది, అసెంబ్లీ ఎన్నికలు వేళ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఇది బీజేపీ కుట్ర అని పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో కారు లోపల నగదు నిండిన బ్యాగ్ కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. గౌరవ్ అనే ఉద్యోగి నుంచి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నామని అంటున్నారు.
గౌరవ్ ఢిల్లీ ప్రభుత్వంలోని MTS (మల్టీ టాస్కింగ్ డిపార్ట్‌మెంట్)లో సీఎం అతిషి వద్ద పనిచేస్తున్నాడు. అయితే దీనిపై గౌరవ్ మాట్లాడుతూ ఆ నగదు తన వ్యక్తిగతమైనది అని చెబుతున్నాడు. తన ఇంటి అమ్మకానికి సంబంధించినదని వెల్లడించాడు. తాను తన ఇంటిని అమ్మేసి మరొకటి కొన్నానని.. ఈ డబ్బు చెల్లించేందుకు తీసుకువెళ్తున్నానని.. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను తన దగ్గర ఉన్నాయని తెలిపాడు.
ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, గౌరవ్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, అతను అతిషి వ్యక్తిగత సహాయకుడు పంకజ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తేలింది. ఎవరికి, ఎక్కడ ఎంత డబ్బు ఇవ్వాలనే దానిపై వారు కోడ్ పదాలను ఉపయోగించి చర్చించారని పోలీసులు తెలిపారు. డబ్బు ఎక్కడ నుండి వచ్చింది, వారు ఎక్కడికి తీసుకువెళుతున్నారనే దానిపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసు సీడీపీ రవి కుమార్ సింగ్ అన్నారు. గౌరవ్ తో పాటుగా కారు డ్రైవర్ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆరోపణలను ఆప్ తీవ్రంగా తిరస్కరించింది, ఎన్నికల ముందు బీజేపీ చేసిన కుట్ర అని పేర్కొంది. ఇది పూర్తిగా అబద్ధమని.. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఇది తన సొంత డబ్బు అని స్పష్టంగా చెప్పాడని పార్టీ తెలిపింది. ఢిల్లీలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేసింది బిజెపియేనని, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారని ఆ పార్టీ ఆరోపించింది.
ఢిల్లీ ఎన్నికలు ప్రారంభం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఢిల్లీలోని 70 స్థానాలకు పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుని దాదాపు 700 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటించనుంది ఈసీ. ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారం చేపట్టే దిశగా ప్రచారాన్ని చేయగా... బీజేపీ, కాంగ్రెస్ కూడా ఢిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకోవడానికి బాగానే కష్టపడ్డాయి. 25 సంవత్సరాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుంది. గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ ఈ సారి ఎలాగైనా గెలవాలని గట్టిగానే ప్రచారం చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 13,766 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.