Goa Beach : గోవా బీచ్ రిసార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం: ఆరు కాటేజీలు దగ్ధం!

ఉత్తర గోవాలోని ఒక ప్రముఖ బీచ్ రిసార్ట్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అశ్వేమ్ బీచ్‌లోని అజోబా ఆలయం సమీపంలో ఉన్న రిసార్ట్‌లో రాత్రి 8:45 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

New Update
goa

ఉత్తర గోవాలోని ఒక ప్రముఖ బీచ్ రిసార్ట్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అశ్వేమ్ బీచ్‌లోని అజోబా ఆలయం సమీపంలో ఉన్న రిసార్ట్‌లో రాత్రి 8:45 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా విస్తరించి రిసార్ట్‌లోని ఆరు చెక్క కాటేజీలను పూర్తిగా దహనం చేశాయి.

ప్రాణనష్టం జరగలేదు 

మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన పర్యాటకులు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని పోలీసులు ధృవీకరించారు. పెర్నెమ్, మపుసా ప్రాంతాల నుండి వచ్చిన అగ్నిమాపక యంత్రాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రాథమిక విచారణ ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

గోవా తీర ప్రాంతాల్లో ఇటీవల వరుసగా అగ్నిప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం కొద్ది రోజుల క్రితమే (ఏప్రిల్ 4న) ఆరంబోల్ బీచ్‌లోని ఆరు షాక్‌లు (తాత్కాలిక షెడ్లు) మంటల్లో బూడిదయ్యాయి. అంతకుముందు గత ఏడాది డిసెంబర్‌లో అర్పొరాలోని ఒక నైట్ క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో భద్రతా నిబంధనలు పాటించలేదని తేలడంతో పోలీసులు ఇప్పటికే 13 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

చాలా చోట్ల ఫైర్ డిపార్ట్‌మెంట్ నుండి అనుమతులు (NOC) తీసుకోకపోవడం, లోపల మండే స్వభావం ఉన్న చెక్క సామాగ్రిని ఎక్కువగా వాడటం వల్లే మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పర్యాటకులు గోవా వెళ్లేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించే రిసార్ట్‌లను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు