/rtv/media/media_files/2026/05/01/cylinder-2026-05-01-07-45-36.jpg)
దేశంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు నేటి నుండి భారీగా పెరిగాయి. 19 కేజీల బరువుండే ఒక్కో కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా రూ. 993 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో ఢిల్లీలో ఒక సిలిండర్ ధర రూ. 3,071.50కి చేరుకుంది. అయితే, ఇళ్లు, వంటిళ్లలో వాడే డొమెస్టిక్ (14.2 కేజీలు) గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు, ఇది సామాన్య గృహిణులకు ఊరటనిచ్చే అంశం.
సామాన్యులపై భారం పడకుండా
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, సామాన్యులపై భారం పడకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను మార్చకుండా స్థిరంగా ఉంచింది. దేశవ్యాప్తంగా సుమారు 90 శాతం ఇంధన వినియోగం ఈ రిటైల్ విభాగం నుండే జరుగుతుందని, అందుకే వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్ ధర కూడా పెరగలేదు.
Breaking : Commercial 19kg LPG cylinder prices increased by Rs 993 .
— Aseem Manchanda (@aseemmanchanda) May 1, 2026
Now the commercial LPC cylinder will cost 3071 Rs in Delhi.
Earlier it was Rs 2078
New Rate Applicable from 1st May. pic.twitter.com/wfvmnZss2u
డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కు సరఫరా చేసే విమాన ఇంధనం (ATF) ధరలను కూడా ఈసారి పెంచలేదు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ విమానయాన రంగాన్ని, ప్రయాణికులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు IOC పేర్కొంది. అయితే, అంతర్జాతీయ విమాన సంస్థలకు సరఫరా చేసే ఇంధన ధరలను మాత్రం పెంచారు. ప్రతి నెలా ఒకటో తేదీన జరిగే సమీక్షలో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
మొత్తం పెట్రోలియం ఉత్పత్తులలో దాదాపు 80 శాతం వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నాయి. కేవలం 16 శాతం ఉత్పత్తుల ధరలు మాత్రమే పెరిగాయి, అవి కూడా ప్రధానంగా పారిశ్రామిక ఇంధన విభాగానికి చెందినవి. బల్క్ డీజిల్, అంతర్జాతీయ విమాన ఇంధనం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. సుమారు 4 శాతం ఉత్పత్తుల ధరలు తగ్గాయని కూడా సంస్థ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక పరిణామాలను గమనిస్తూనే, దేశీయంగా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేలా ఈ ధరల సవరణ చేపట్టినట్లు అధికారులు వివరించారు.
Follow Us