/rtv/media/media_files/2026/04/16/arav-2026-04-16-15-36-51.jpg)
నిన్న CBSE పదో తరగతి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. వేలమంది విద్యార్థులు తమ మార్కుల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. చాలామందికి అవి కేవలం మార్కులు మాత్రమే కావచ్చు, కానీ ఢిల్లీకి చెందిన ఆరవ్ వాట్స్ అనే విద్యార్థికి మాత్రం ఈ ఫలితాలు ఒక గొప్ప విజయం. ఇది కేవలం పరీక్షల్లో సాధించిన మార్కుల గురించి మాత్రమే కాదు, ఆ మార్కులను చేరుకోవడానికి అతను పడిన కష్టం, చూపించిన ధైర్యం గురించి.
ఢిల్లీలోని మెహ్రౌలీలో నివసించే ఆరవ్ ఒక వైద్యుల కుటుంబం నుండి వచ్చాడు. అతని తండ్రి అజయ్ వాట్స్ జనరల్ ఫిజీషియన్ కాగా, తల్లి రజనీ వాట్స్ గైనకాలజిస్ట్. అన్నయ్య బిటెక్ చదువుతున్నాడు. ఇంట్లో అందరూ డాక్టర్లు ఉన్నప్పటికీ, సొంత ప్రాణానికే ప్రమాదం వచ్చే అనారోగ్యం ఎదురైనప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. గత రెండేళ్లుగా ఆరవ్ లింఫోబ్లాస్టిక్ లింఫోమా అనే తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. ఇది సాధారణంగా పిల్లల్లో వేగంగా వ్యాపిస్తుంది. దీనికి తీసుకునే చికిత్స చాలా కష్టంగా, అలసటగా ఉంటుంది. సాధారణ విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయిస్తే, ఆరవ్ మాత్రం తన సమయాన్ని చదువుకు, హాస్పిటల్ చికిత్సకు మధ్య పంచుకోవాల్సి వచ్చింది.
టీచర్లు, ప్రిన్సిపాల్ ఎంతో అండగా
ఆరవ్ తన ప్రిపరేషన్ గురించి చెబుతూ.. స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాల్ తనకు ఎంతో అండగా నిలిచారని తెలిపాడు. తను అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరినప్పుడు కూడా టీచర్లు ఆన్‌లైన్ క్లాసులు తీసుకుని, ఫోన్ ద్వారా సందేహాలను తీర్చి చదువులో వెనకబడకుండా చూశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, రోజుకు కనీసం ఐదు నుండి ఆరు గంటల పాటు క్రమం తప్పకుండా చదువుకునేవాడు. క్లిష్ట సమయాల్లో కూడా క్రమశిక్షణతో చదవడమే తనను ఈ స్థాయికి చేర్చిందని ఆరవ్ అంటాడు.
కేవలం చదువే కాకుండా, మానసిక ప్రశాంతత కోసం ఆరవ్ ఇతర వ్యాపకాలపై కూడా దృష్టి పెట్టాడు. హాస్పిటల్ గదుల్లో ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా గేమింగ్ కన్సోల్‌లో ఆటలు ఆడటం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం చేసేవాడు. ముఖ్యంగా సంగీతం అతనికి ఎంతో ఓరటనిచ్చింది. యూట్యూబ్ చూస్తూ సొంతంగా గిటార్ వాయించడం నేర్చుకున్నాడు. ఈ అలవాట్లు చికిత్స సమయంలో అతనికి సాధారణ జీవితాన్ని గడుపుతున్నామనే భావనను కలిగించాయి.
భవిష్యత్తులో ఆరవ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ (ఖగోళ భౌతిక శాస్త్రవేత్త) కావాలని కలలు కంటున్నాడు. తనకు ఇష్టమైన ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో రీసెర్చ్ చేయాలనేది అతని లక్ష్యం. తనకు ఇంతటి ధైర్యాన్ని ఇచ్చిన తన తల్లిదండ్రులే తనకు ఆదర్శమని, వారు ఎప్పుడూ తనను ప్రోత్సహిస్తూ అండగా నిలిచారని ఆరవ్ గర్వంగా చెబుతున్నాడు.
జీవితంలో ఎప్పుడూ ఆశ కోల్పోవద్దని, ఏది జరిగినా ఒక కారణం ఉంటుందని ఆరవ్ సందేశమిస్తున్నాడు. 96.6 శాతం మార్కులు సాధించడం అంటే అది కేవలం అంకెలే కాదు, చావును సైతం ఎదిరించి పోరాడిన ఒక కుర్రాడి గెలుపు. హాస్పిటల్ కారిడార్లు, అనిశ్చితి, తీవ్రమైన నొప్పిని భరిస్తూ కూడా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న ఆరవ్ కథ అందరికీ ఒక గొప్ప పాఠం. సంకల్పం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని అతను నిరూపించాడు.
Follow Us