Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో వరుస బాంబు బెదిరింపులు.. అధికారులు అప్రమత్తం!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వరుసగా రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్లు రావడం కలకలం రేపింది. దుబాయ్- హైదరాబాద్, ఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్లను సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. బెదిరింపులపై పోలీసులు, సైబర్ క్రైమ్ దర్యాప్తు చేపట్టారు.

New Update
Bomb Threat

Bomb Threat

Bomb Threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Shamshabad Airport) శనివారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టారనే మెయిల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టి పరిస్థితిని కట్టడి చేసింది.

పైలట్‌కు వెంటనే హెచ్చరిక అందించడంతో, జాగ్రత్త చర్యగా విమానాన్ని శంషాబాద్‌లో అత్యంత సురక్షిత ప్రాంతంలో ల్యాండ్ చేశారు. ఇతర విమానాలకు దూరంగా విమానాన్ని నిలిపి ఉంచారు. ల్యాండింగ్ సమయంలోనే ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత సీఐఎస్‌ఎఫ్, బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ బృందాలు విమానంలో తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికులు ఒక్కొక్కరిని దింపి వారి సామాన్లను పూర్తిగా చెక్ చేశారు. ప్రయాణికులు తమ లగేజ్‌ను తీసుకున్న తర్వాతే ఎయిర్‌పోర్ట్ వెలుపలికి వెళ్లాలని అధికారులు సూచించారు. మొత్తం ప్రక్రియలో ప్రయాణికులు సహకరించడంతో పెద్ద ఇబ్బంది లేకుండా తనిఖీలు కొనసాగాయి.

ఈ విమానంలో ఎంపీ ఆర్.కృష్ణయ్యతో పాటు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం. బాంబు బెదిరింపు కారణంగా వీరిని కూడా భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు.

బాంబు ఉందనే సమాచారం తప్పుడు కావచ్చనే అనుమానాలు ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అన్ని తనిఖీలు పూర్తి చేశారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్ జోన్‌కు తరలించి మళ్లీ తనిఖీలు చేస్తున్నారు.

ఇక మరోవైపు, ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపారు? దాని వెనుక ఏదైనా ఉద్దేశ్యం ఉందా? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ పంపిన వ్యక్తి యొక్క వివరాలను కనుగొనేందుకు సైబర్ క్రైమ్ విభాగం కూడా రంగంలోకి దిగింది.

ఈ సంఘటనతో కొంతసేపు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, అధికారులు సమయానికి స్పందించడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారుల సమాచారం.

మొత్తానికి, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వరుసగా రావడం ఆందోళనగా మారింది. అలాగే, శుక్రవారం ఉదయం కూడా దుబాయ్ నుంచి వస్తున్న ఈకే–526 విమానానికి బాంబు పెట్టారని ఒక అనుమానాస్పద మెయిల్ రావడంతో పెద్ద కలకలం రేగింది.

తెల్లవారు జామున 3.38 గంటలకు దుబాయ్ నుంచి బయల్దేరిన ఈ విమానం శంషాబాద్‌లో ల్యాండ్ అయ్యే సమయానికి, ఉదయం 7.20 గంటలకు ఆర్‌జీఐఏ కస్టమర్ సపోర్ట్ మెయిల్‌కు “విమానంలో బాంబులు పెట్టాం” అనే సందేశం చేరింది. ఈ సమాచారంతో భద్రతా విభాగం వెంటనే అలర్ట్ అయ్యింది. బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ (BTAC) ను ఏర్పాటు చేసి అత్యవసర చర్యలు చేపట్టారు.

విమానం ఉదయం 8.38 గంటలకు శంషాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇతర విమానాలకు దూరంగా ప్రత్యేక ప్రాంతానికి విమానాన్ని తరలించారు. సీఐఎస్‌ఎఫ్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ప్రయాణికులు, వారి బ్యాగులను పరిశీలనలు చేశారు. ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు. అనంతరం విమానాశ్రయ ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ రెండు ఘటనలు వరుసగా రావడంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఎందుకు ఇవి చేస్తున్నారు? అనే అంశాలపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.

ప్రయాణికుల భద్రతే తమ మొదటి లక్ష్యమని, ఇలాంటి బెదిరింపులు వచ్చిన ప్రతిసారి చాలా జాగ్రత్తతో పనిచేస్తామని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలతో కొంతసేపు కలకలం ఏర్పడినా, సమయానికి చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Advertisment
తాజా కథనాలు