/rtv/media/media_files/2026/02/12/ahmedabad-plane-crash-report-2026-02-12-12-44-42.jpg)
Ahmedabad Plane Crash Report
Ahmedabad Plane Crash Report: గత సంవత్సరం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల కాకుండా, ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య కారణంగా జరిగిందని ఇటలీకి చెందిన ప్రముఖ పత్రిక కొరియెరే డెల్లా సెరా వెల్లడించింది. అయితే ఈ కథనం అధికారిక నివేదిక ఆధారంగా కాకుండా, విచారణకు సంబంధించిన వర్గాల సమాచారం ఆధారంగా వచ్చినదని పేర్కొంది.
2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. సమీపం లో ఉన్న మెడికల్ విద్యార్థుల హాస్టల్‌పై విమానం పడటంతో మరికొంతమంది మరణించారు. మొత్తం 260 మంది మృతి చెందారు. ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read: రష్యాలో వాట్సాప్ బ్లాక్.. MAX యాప్‌తో పుతిన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ఇటాలియన్ పత్రిక కథనం ప్రకారం, విమాన ఇంజిన్‌లకు ఇంధనం సరఫరా చేసే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు మానవ చర్య వల్లే “రన్” స్థితి నుంచి “కట్ ఆఫ్” స్థితికి మారినట్టు దర్యాప్తు బృందం గుర్తించిందట. బ్లాక్ బాక్స్ డేటా, శుభ్రం చేసిన కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్ ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రాథమిక నివేదికలో కూడా ఒక పైలట్ “ఎందుకు ఫ్యూయల్ ఆఫ్ చేశావు?” అని అడగగా, మరొకరు “నేను చేయలేదు” అని చెప్పిన సంభాషణ నమోదైందని వెల్లడించారు. అయితే ఎవరు ఆ స్విచ్ మార్చారనే విషయం స్పష్టంగా చెప్పలేదు.
Also Read: కాన్పూర్ లంబోర్గిని యాక్సిడెంట్.. టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా అరెస్ట్!
కెప్టెన్ సుమీత్ సభర్వాల్ విమాన కమాండర్‌గా ఉండగా, క్లైవ్ కుందర్ కో-పైలట్‌గా ఉన్నారు. తాజా కథనం ప్రకారం ప్రధాన అనుమానం కెప్టెన్‌పై ఉందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ఒక నెల ముందు నుండి ఆయన డిప్రెషన్‌తో బాధపడుతున్నారని వార్తలు వచ్చినట్లు పత్రిక రాసింది. అయితే ఈ ఆరోపణలను సభర్వాల్ తండ్రి ఖండించారు. తన కుమారుడి మానసిక స్థితిపై వస్తున్న వార్తలు అబద్ధమని, కొత్తగా పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అమెరికా నిపుణులు కూడా ఈ దర్యాప్తులో భాగమయ్యారు. వారు సిమ్యులేటర్ పరీక్షలు నిర్వహించగా, సాంకేతిక లోపం వల్ల రెండు ఇంజిన్‌లు ఒకేసారి ఆగిన పరిస్థితి కనిపించలేదని తెలిపారు. మానవ జోక్యం మాత్రమే సాధ్యమైన కారణమని భావించినట్లు కథనం చెబుతోంది.
డిసెంబర్‌లో భారత దర్యాప్తు అధికారులు వాషింగ్టన్ వెళ్లి బ్లాక్ బాక్స్ డేటాను మళ్లీ పరిశీలించినట్లు సమాచారం. శబ్ద రికార్డింగ్ విశ్లేషణలో ఏ పైలట్ స్విచ్ మార్చారో స్పష్టత వచ్చినట్లు వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పటివరకు భారత విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB), డీజీసీఏ లేదా పౌర విమానయాన శాఖ ఈ కథనంపై అధికారిక స్పందన ఇవ్వలేదు. తుది నివేదిక ఇంకా విడుదల కాలేదు. ఆ నివేదికలో పైలట్ల మానసిక ఆరోగ్యాన్ని తరచుగా పరీక్షించే విధానంపై సిఫార్సులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రమాదం తర్వాత మొదట సాంకేతిక లోపం, మానవ తప్పిదం వంటి అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఫ్యూయల్ స్విచ్‌లపైనే ప్రధాన దృష్టి పడింది. తుది నివేదిక ఎలా ఉంటుందో ఇంకా తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ అంశంపై పూర్తి స్పష్టత రానుంది.
Follow Us