/rtv/media/media_files/2026/04/26/aap-2026-04-26-15-22-35.jpg)
ఆమ్ ఆద్మీ పార్టీలో చెలరేగిన రాజకీయ సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు సామూహికంగా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఆప్ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది. పార్టీని వీడిన ఈ ఏడుగురు సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆప్ నేత సంజయ్ సింగ్ ఆదివారం రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఈ విషయంలో ఆప్ నాయకత్వం న్యాయ నిపుణుల సలహాలను కూడా తీసుకుంది. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి వంటి ప్రముఖులతో చర్చించినట్లు సంజయ్ సింగ్ తెలిపారు. చట్టం ప్రకారం ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయని వారు అభిప్రాయపడినట్లు ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఇలాంటి ఫిరాయింపులు చెల్లవని, ఇది ముమ్మాటికీ అనర్హతకు దారితీస్తుందని ఆప్ వాదిస్తోంది.
అసంతృప్తి వల్లే బయటకు
పార్టీని వీడిన వారిలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, స్వాతి మలివాల్, విక్రమ్‌జిత్ సాహ్నీ ఉన్నారు. అయితే వీరు పార్టీని వీడటానికి గల కారణాలను వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పట్ల నిరాశ, అసంతృప్తి వల్లే తాము బయటకు వచ్చినట్లు రాఘవ్ చద్దా పేర్కొనగా.. పంజాబ్‌లో పెరిగిపోతున్న అప్పులు, రైతుల సమస్యలు, డ్రగ్స్ వాడకం వంటి అంశాలపై ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని విక్రమ్‌జిత్ సాహ్నీ ఆరోపించారు. నాయకత్వం తమకు అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా రంగంలోకి దిగారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, సదరు ఎంపీలను రీకాల్ చేయాలని కోరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే భారత రాజ్యాంగంలో ఎంపీలను లేదా ఎమ్మెల్యేలను వెనక్కి పిలిపించే 'రీకాల్' విధానం లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. మూడింట రెండు వంతుల సభ్యులు విడిపోయి వేరే పార్టీలో విలీనమైతే అనర్హత వర్తించదని కొందరు నిపుణులు చెబుతుండగా, ఆప్ మాత్రం ఇది రాజ్యాంగ విరుద్ధమని గట్టిగా వాదిస్తోంది.
Follow Us