World Malaria Day 2024: మానవాళిని పీడించే మలేరియా నుంచి జాగ్రత్తపడదామిలా!

New Update
World Malaria Day 2024: మానవాళిని పీడించే మలేరియా నుంచి జాగ్రత్తపడదామిలా!

దోమలద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి మలేరియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం- ఇప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షలకు పైగా మందిని కబళించింది. ఇది తీవ్రమైన సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుంది. ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మలేరియా బారిన పడుతున్నారు. మనదేశంలో మలేరియా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు వరల్డ్‌ మలేరియా రిపోర్టు చెబుతున్నప్పటికీ ఇంకా ఇదొక సమస్య గానే మిగిలి పోయింది.

నిజానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే మలేరియాను నివారించుకోవటం అసాధ్యమేమీ కాదు. మలేరియా గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో, ప్రపంచ మలేరియా దినోత్సవం 2024 ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25 న జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధి. ఇది సోకిన ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. మలేరియా జ్వరం ఎక్కువగా వేసవి, వర్షాకాలంలో వస్తుంది. అనాఫిలిస్ కాటుకు గురైన వెంటనే, ప్లాస్మోడియం వైవాక్స్ మానవ శరీరంలోకి ప్రవేశించి స్వయంగా గుణించడం ప్రారంభిస్తుంది. ఈ పరాన్నజీవి కాలేయ కణాలను ఇన్‌ఫెక్షన్‌కు గురిచేస్తుంది. ఆ కణాలు విచ్ఛిన్నం కావటం వల్ల పరాన్నజీవులు రక్తంలోకి, తర్వాత ఎర్ర రక్తకణాలకు చేరుకుంటాయి. ఇన్‌ఫెక్షన్‌ కలగజేస్తాయి. ఇలాంటి వ్యక్తులను దోమలు కుట్టటం, అవి మరొకరిని కుట్టటం.. వారిలో ఇన్‌ఫెక్షన్‌ కలగజేయటం.. ఇలా ఒక చక్రం లా కొనసాగుతూ వస్తుంటుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోక పోతే, రోగి మరణించే అవకాశం ఉంది.

మలేరియా లక్షణాలు.. మలేరియా అత్యంత సాధారణ ప్రారంభ లక్షణాలు జ్వరం, తలనొప్పి, చలి. ఈ లక్షణాలు సాధారణంగా సోకిన దోమ కుట్టిన 10-15 రోజులలోపు ప్రారంభమవుతాయి. రానురాను విపరీతమైన అలసట, మూర్ఛపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం వంటివి కనిపిస్తాయి. ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమైనప్పుడు హిమోగ్లోబిన్‌ కిడ్నీల ద్వారా బయటకు వస్తే మూత్రం నల్లగా కనిపించొచ్చు. సమస్య తీవ్రమైతే కాలేయం, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలూ దెబ్బతినొచ్చు.

మలేరియా నివారణ మార్గాలు.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి. ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో దోమల నివారణకు దోమలపొగగానీ, మందుగానీ చల్లించాలి. నివాస ప్రదేశాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఎందుకంటే అనాఫిలిస్ దోమలు నీటి నిల్వల్లో గుడ్లు పెడుతుంది. దోమలకు అవకాశం ఇవ్వకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి. దోమతెరను ఉపయోగించాలి. అధిక జ్వరం , వణుకు వస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మలేరియాకు చికిత్స కన్న నివారణే సులభమని గమనిస్తూ నివారణ మార్గాలు పాటించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు