మంత్రి.. మళ్లీ వెనక్కి వస్తున్నారా!?

తెలంగాణ బీజేపీలో జనరల్ సెక్రెటరీ(ఆర్గనైజేషన్), ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కావడమే. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి మంత్రి శ్రీనివాస్ ని వెనక్కి తీసుకొస్తున్నారా? అని ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

New Update
మంత్రి.. మళ్లీ వెనక్కి వస్తున్నారా!?

తెలంగాణ బీజేపీలో జనరల్ సెక్రెటరీ(ఆర్గనైజేషన్), ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ పేరు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కావడమే. ఢిల్లీలో వీళ్లిద్దరూ కలిసి పలు అంశాలపై చర్చించుకున్నారు. తెలంగాణ బీజేపీలో భారీ మార్పుల నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్.. అమిత్ షాను కలవడం హాట్ టాపిక్ గా మారింది.

is manthri srinivas coming back to state

తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర

తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతో కష్టపడ్డారు మంత్రి శ్రీనివాస్. దాదాపు పదేళ్ల పాటు రాష్ట్రంలో సంఘటనా మంత్రిగా పని చేశారు. పార్టీని గ్రామగ్రామాన తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. పార్టీ కోసం పూర్తి సమయం ఇచ్చే వందలమందిని సమన్వయ పరచడంలో మంత్రి చేసిన కృషితో కమలం పార్టీ సంచలన విజయాలను నమోదు చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల విజయాల్లో ఇతర నాయకులతో కలిసి కీలక భూమిక పోషించారు. పైస్థాయి లీడర్ల నుంచి కిందిస్థాయి కార్యకర్తల దాకా మంత్రి శ్రీనివాస్ పై ప్రత్యేక అభిమానం ఉందనేది పార్టీలో టాక్.

చండీగఢ్ కు వెళ్లాక పార్టీలో గందరగోళం

తెలంగాణ బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్ ను మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అనూహ్యంగా పంజాబ్ రాష్ట్ర సంఘటనా మంత్రిగా ట్రాన్స్ ఫర్ చేసింది అధిష్టానం. పంజాబ్ లో బీజేపీ బలోపేతానికి ఆయన సేవలను ఉపయోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. శ్రీనివాస్ వెళ్లాక పార్టీలో పరిస్థితులు మారిపోయాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న మునుగోడులో బీజేపీ ఓటమి పాలైంది. ఈ ఓటమి సంఘటనా మంత్రి లేకపోవడం వల్లే జరిగిందనే ప్రచారం జరిగింది. కీలక సమయంలో శ్రీనివాస్ లేకపోవడంతో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందనేది తెలంగాణ బీజేపీలోని కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫీలింగ్.

తాజా మార్పుల వెనుక ఉన్నదెవరు?

ఈమధ్య తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరిగాయి. పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించి.. ఈటల రాజేందర్ కు పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. అయితే.. ఈ మార్పుల వెనుక చండీగఢ్ నుంచి ఓ వ్యక్తి హస్తం ఉందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో అమిత్ షాను మంత్రి శ్రీనివాస్ కలవడం చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి మంత్రి శ్రీనివాస్ ని వెనక్కి తీసుకొస్తున్నారా? అని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరోవైపు.. ఇతర పార్టీల నుంచి వచ్చి ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకురావడంలోనూ మంత్రి శ్రీనివాస్ గతంలో కీలక పాత్ర పోషించారని పార్టీ సీనియర్లే చెబుతుంటారు. వారందరితో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో నేతల మధ్య సఖ్యతను పెంచేందుకు ఆయన్ను మళ్లీ తెలంగాణకు తీసుకొస్తున్నారేమో అనే అనుమానం పార్టీ వర్గాల్లో కలుగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు