/rtv/media/media_files/2026/02/24/prime-minister-2026-02-24-12-49-31.jpg)
నెదర్లాండ్స్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీ66 (D66) పార్టీ నేత రోబ్ జెటెన్ ఆ దేశ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హేగ్‌లోని హుయిస్ టెన్ బాష్ ప్యాలెస్‌లో కింగ్ విల్లెం-అలెగ్జాండర్ సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కేవలం కొద్ది కాలం మాత్రమే పదవిలో ఉన్న డిక్ షూఫ్ స్థానంలో జెటెన్ బాధ్యతలు చేపట్టారు. రోబ్ జెటెన్ ఒక గే.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
ఇలా నెదర్లాండ్స్ రాజకీయాల్లో తన లైంగిక ధోరణిని బహిరంగంగా ప్రకటించుకున్న అతికొద్ది మంది కీలక నాయకుల్లో రోబ్ జెటెన్ ఒకరు. 38 ఏళ్ల వయస్సులోనే ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. ఆయన D66 66 అనే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాని కావడానికి ముందు ఆయన నెదర్లాండ్స్ ప్రభుత్వంలో వాతావరణ, ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన్ను వార్తల్లో నిలిపాయి.
ప్రమాణ స్వీకారానికి ముందు జెటెన్ ఎక్స్ వేదికగా ఒక సెల్ఫీ పోస్ట్ చేస్తూ.. "దేశం కోసం బాధ్యతాయుతంగా, ధైర్యంగా అందరం కలిసి పనిచేస్తాం" అని రాసుకొచ్చారు. తప్పులను వెతకడం కంటే, మెరుగుపరచాల్సిన అంశాలపై దృష్టి పెడతామని ఆయన హామీ ఇచ్చారు.
శరణార్థుల సమస్యపై దృష్టి
ఈ కొత్త కూటమి ప్రభుత్వం (D66, VVD, CDA) ప్రధానంగా శరణార్థుల సమస్యపై దృష్టి సారించింది. గత రెండు ప్రభుత్వాలు కూలిపోవడానికి ఈ శరణార్థుల అంశమే ప్రధాన కారణం కావడంతో, జెటెన్ ప్రభుత్వం ఇప్పుడు కఠిన నిబంధనలను తీసుకురానుంది. శరణార్థులు యూరప్‌కు చేరుకున్నాక కాకుండా, యూరప్ బయటే ఉండి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవాలనే కొత్త విధానాన్ని అమలు చేయాలని కూటమి నిర్ణయించింది.
రోబ్ జెటెన్‌కు పెళ్లి కాలేదు. ఆయనకు అర్జెంటీనాకు చెందిన ప్రసిద్ధ హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్ తో నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ 2022 నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2024 నవంబర్‌లో పారిస్ ఒలింపిక్స్ సమయంలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం 2026 వేసవిలో జరిగే అవకాశం ఉంది. నికోలస్ కీనన్ అర్జెంటీనా జాతీయ హాకీ జట్టులో కీలక ఆటగాడు. ఆయన నెదర్లాండ్స్‌లోని ఒక క్లబ్ తరపున కూడా ఆడతారు. వీరిద్దరూ ఒకే ఏరియాలో నివసించడం వల్ల పరిచయమయ్యారు.
Follow Us