Medicine Prices : యుద్ధం సెగ.. టాబ్లెట్స్ ధరలకు రెక్కలు: 900 రకాల మందుల ధరల పెంపు!

పశ్చిమాసియా యుద్ధం కేవలం పెట్రోల్, డీజిల్ ధరలనే కాదు.. మన ప్రాణాలను కాపాడే మందుల ధరలను కూడా అమాంతం పెంచేస్తోంది. యుద్ధం కారణంగా ముడి పదార్థాల సరఫరా దెబ్బతినడంతో, సుమారు 900 రకాల అత్యవసర మందుల ధరలు సామాన్యుడికి భారంగా మారనున్నాయి.

New Update
tablets

పశ్చిమాసియా యుద్ధం కేవలం పెట్రోల్, డీజిల్ ధరలనే కాదు.. మన ప్రాణాలను కాపాడే మందుల ధరలను కూడా అమాంతం పెంచేస్తోంది. యుద్ధం కారణంగా ముడి పదార్థాల సరఫరా దెబ్బతినడంతో, సుమారు 900 రకాల అత్యవసర మందుల ధరలు సామాన్యుడికి భారంగా మారనున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాత స్టాక్ ధరలు మారకపోయినా, కొత్తగా తయారవుతున్న మందుల ధరలు మాత్రం 20 శాతం నుంచి ఏకంగా 180 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఫార్మా వర్గాలు చెబుతున్నాయి.

ధరలు 200 నుండి 300 శాతం

ముఖ్యంగా మందుల తయారీలో వాడే ఏపీఐలు, ఇతర ముడి పదార్థాల ధరలు 200 నుండి 300 శాతం పెరగడమే ఈ పరిస్థితికి కారణం. మనం నిత్యం వాడే పారాసెటమాల్, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఇన్సులిన్ వంటి మందుల ధరలు ఇప్పటికే పెరిగినట్లు సమాచారం. సిరప్‌ల తయారీలో కీలకమైన గ్లిజరిన్, ప్రొపైలిన్ గ్లైకాల్ ధరలు పెరగడంతో చిన్న పిల్లలు వాడే ఓరల్ డ్రాప్స్, ఇతర ద్రవ రూప మందుల తయారీ ఖర్చు కూడా భారమైంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు, గుండె జబ్బులు, డయాబెటిస్ ఉన్న రోగులపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడనుంది.

ఈ ధరల పెరుగుదల ప్రభావం ప్రభుత్వ ఆస్పత్రులపైన కూడా పడుతోంది. సాధారణంగా మందుల సరఫరాదారులు ప్రభుత్వంతో ఏడాది లేదా రెండేళ్ల పాటు ఒకే ధరకు మందులు ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ముడి పదార్థాల ధరలు పెరగడంతో, పాత ధరలకు మందులు సరఫరా చేయలేమని చాలామంది చేతులెత్తేస్తున్నారు. విపత్తుల సమయంలో ఒప్పందాలను మార్చుకోవచ్చనే నిబంధనను వాడుకుంటూ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. దీనివల్ల సర్కారు దవాఖానాల్లో మందుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సామాన్యులకు 'జనరిక్' మందులే మేలైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు