బంగారం పేరిట ఘరానా మోసం..రూ.15 లక్షలు స్వాహా..!!

దంపతులను మాయమాటలతో నమ్మించి రూ.15 లక్షలు దోచుకెళ్లారు దుండగులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. బంగారం పేరిట ఘరానా మోసం చేశారు.

New Update
బంగారం పేరిట ఘరానా మోసం..రూ.15 లక్షలు స్వాహా..!!

Eluru District: ఏలూరు జిల్లాలో బంగారం పేరిట ఒక ముఠా ఘరానా చోరికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో నమ్మించి దుండగులు రూ.15 లక్షలు దోచుకెళ్లారు. కుక్కునూరు మండలం తొండిపాక గ్రామానికి చెందిన కొత్తూరి చెన్నకేశవకు తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. దీంతో చెన్నకేశవ తాను బంగారం కొనదలుచుకున్న విషయం సదరు వ్యక్తికి తెలిపాడు. బంగారం కొనుగోలు జాగ్రత్తగా చేయాలని, దుకాణాలకు వెళితే మోసం చేస్తారని.. ఆ వ్యక్తి నమ్మబలికాడు. మనం ఆర్డర్‌ చేస్తే మేలిమి బంగారం తెచ్చి ఇచ్చే వ్యాపారులు ఉంటారని, వారి నుంచి కొనుగోలు చేస్తే మోసాలకు తావుండదని తెలిపాడు.ఈ క్రమంలో దుబాయ్ నుంచి అక్రమ మార్గంలో తీసుకొచ్చిన బంగారం బిస్కెట్లు తమ వద్ద ఉన్నాయని ఆ దంపతులను నమ్మించారు. అరకిలో బంగారు బిస్కెట్లు 20 లక్షల రూపాయలకు ఇస్తామని ఆ వ్యక్తి నమ్మించారు.

ఆ తర్వాత సదరు వ్యక్తి తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు బంగారు బిస్కెట్లు ఇస్తామని చెన్నకేశవ రావు ను తాడేపల్లిగూడెం రమ్మన్నారు. అక్కడి నుంచి జంగారెడ్డి గూడెం, ఏలూరు అంటూ తిప్పారు. బంగారం చూపించి నమ్మబలికారు. జీఎస్టీ లేని బంగారం కావడంతో చెన్నకేశవ రావు కూడా ఆశపడి కొనుగోలు చేస్తానని చెప్పాడు. అనంతరం ఆ ముఠా బంగారం పట్టుకొని తోండిపాక గ్రామానికి వచ్చారు. అయితే, ప్రస్తుతం తన దగ్గర రూ.15 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇంకో 5 లక్షలు నగదు బంధువుల దగ్గర అప్పు చేసి ఇస్తానని చెన్నకేశవ రావు ఆ ముఠాకు మాట ఇచ్చి అప్పు కోసం వేరే గ్రామం వెళ్ళాడు.

ఇదే అదునుగా భావించిన ఆ ముఠా ఇంట్లో చెన్నకేశవ రావు లేకపోవడంతో అతని భార్యను మాటల్లో పెట్టీ ఇంట్లో ఉన్న రూ. 15 లక్షల నగదును దోచుకొని పోయారు. దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఫిర్యాదు చేసి 4 నెలలు అవుతున్న ఎటువంటి స్పందన రాలేదు. దీంతో బాధిత చెన్నకేశవ రావు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. గుప్తా,అబ్రహాం, సుంకర ఆంజనేయులు, తమను మోసం చేశారని, ఇంట్లో ఉన్న నగదు దోచుకెళ్లారనీ బాధితుడు వాపోతున్నాడు.  నిందితులను త్వరగా పట్టుకొని తమ డబ్బు రికవరీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: బిర్యానీలో కాళ్ళ జెర్రీ.. ఉలిక్కిపడ్డ కస్టమర్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు