Telangana Students: మెడికల్ అడ్మిషన్లలో గందరగోళం.. అసలు స్థానికత వివాదం ఏమిటి?

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 33 వివాదాస్పదం అయింది. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్స్ పై  తీర్పు వచ్చింది. అసలు జీవో 33 వివాదం ఏమిటి? తీర్పు తరువాత ఏమి జరగవచ్చు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

New Update
Telangana Students: మెడికల్ అడ్మిషన్లలో గందరగోళం.. అసలు స్థానికత వివాదం ఏమిటి?

Telangana Students:  మెడికల్, డెంటల్ కాలేజీల ప్రవేశాల విషయంలో కీలక తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు వైద్య కళాశాలల్లోప్రవేశాలు కల్పించాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ఎడ్మిషన్స్ నిబంధనలు 2027 కు సవరణ చేస్తూ.. దానికి 3(ఎ) క్లాజును చేర్చింది. ఈ మేరకు జీవో 33ని తీసుకువచ్చింది. ఈ జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టులో 53 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం.. సుదీర్ఘ వాదనల తరువాత తన తీర్పును గురువారం వెల్లడించింది. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు వైద్య కళాశాలల్లోప్రవేశాలు కల్పించాలని తీర్పు ఇచ్చిన కోర్టు అదేసమయంలో జీవో 33 రద్దు చేయడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో జీవో 33 ఏమిటి? అసలు వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిబంధనల్లో మార్పులు ఎందుకు చేశారు? ఇప్పుడు కోర్టు తీర్పు వలన తెలంగాణ విద్యార్థులకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఈ విషయాలను తెలుసుకుందాం. 

అసలు వివాదం ఏమిటంటే.. 

Telangana Students: అప్పట్లో అంటే 1979లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం విద్య, ఉద్యోగాల విషయంలో 646 జీవో విడుదల చేసింది. దీని ప్రకారం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు 85 సీట్లు స్థానికులకు, 15 శాతం ఓపెన్‌ క్యాటగిరీకి చెందినవి గాను పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాకా అంటే 2014లో విభజన చట్టంలో పదేళ్ల పాటు ఇదే జీవో అమలులో ఉండేలా ఏర్పాటు చేశారు. దీని ప్రకారమే ఈ పదేళ్లు వైద్య సంస్థల్లో ఎడ్మిషన్స్ జరుగుతూ వస్తున్నాయి. అయితే, జూన్ 2024తో విభజన చట్టం అమలులో ఉండాల్సిన పదేళ్లు పూర్తి అయిపోయాయి. ఈ నేపథ్యంలో మెడికల్‌ అడ్మిషన్లలో స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జీవో 33 ను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. 

జీవో 33లో ఏముందంటే.. 

Telangana Students:  తెలంగాణ ప్రభుత్వం జీవో 33లో కూడా 1979, 2017లో జారీ చేసిన ఉత్తర్వుల్లోని రెండు అంశాలనే పేర్కొంది. ఇందులో ఇంటర్ కు ముందు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్ కోసం స్థానికతగా జీవో 33లో పేర్కొన్నారు. నీట్ పరీక్షకు ముందు ఏడేళ్లు తెలంగాణలోనే చదవడం.. అలాగే నాలుగేళ్లపాటు తెలంగాణలో చదివినా లోకల్ అవుతారనే నిబంధనను తొలగించారు. దీంతో తెలంగాణలో పుట్టి పెరిగిన విద్యార్థులకు అడ్మిషన్స్ లో అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, తెలంగాణ వెలుపల ఇంటర్ చదివిన వారికీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా వర్తించదు. సాధారణంగా చాలామంది విద్యార్థులు ఇంటర్ ఏపీలో హాస్టళ్లలో ఉండి చదువుకుంటారు. దీంతో అలాంటి తెలంగాణ విద్యార్థులకు ఎడ్మిషన్స్ లో అన్యాయం జరుగుతుందని తల్లిదండ్రులు, విపక్షాలు తప్పు పట్టాయి. ఈ నిబంధన వలన ఏపీ లేదా బెంగళూరు లాంటి చోట చదువుకున్న తెలంగాణ విద్యార్థులు ఎడ్మిషన్ల విషయంలో నాన్ లోకల్ అయిపోతారని వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

తీర్పు ప్రభావం ఎలా ఉంటుంది?

Telangana Students: ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ  53 వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలు అయ్యాయి. తమ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్లు. సుదీర్ఘంగా జరిగిన వాదనల తరువాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఈ తీర్పు ప్రకారం తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారు ఎవరైనా స్థానికులే అవుతారు. ఆ విద్యార్థులు ఒకవేళ ఇంటర్ బయట రాష్ట్రాల్లో చదివినా కానీ, వారి స్థానికతకు వచ్చే ముప్పేమీ ఉండదు. అయితే, జీవో 33 లో చేసిన సవరణ 3ఏని రద్దు చేస్తే కనుక దేశంలో ఉన్నవారంతా స్థానిక కోటా కింద సీట్లు పొందేందుకు అర్హులు అయిపోతారని కోర్టు చెప్పింది. అందువల్ల జీవోను రద్దు చేయట్లేదని స్పష్టం చేసింది.

దీంతో పాటు.. విద్యార్థుల స్థానికతను నిర్ణయించే గైడ్ లైన్స్ ఏవీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదనీ.. వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని కోర్టు తీర్పులో పేర్కొన్నారు. ప్రభుత్వం నిబంధనలు రూపొందించాకా.. వాటి ఆధారంగా విద్యార్థుల స్థానిక కోటాను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నిర్ధారించి, సీట్లను కేటాయిస్తుందని తెలిపింది. అంటే బాల్  ఇప్పుడు ప్రభుత్వ కోర్టులో ఉంది. ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలు రూపొందించాలి. దాని ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. 

Telangana Students:  కోర్టు తీర్పుతో తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనలు రూపొందించేటపుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు