diamonds: ఇక 150 నిమిషాల్లోనే కృత్రిమంగా వజ్రాలు!

భూమ్మీద సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో వజ్రం కూడా ఒకటి. ఫ్యాషన్ మార్కెట్ లో దీనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా సహజ డైమండ్లను వెలికితీసి సానబెట్టేందుకు సుదీర్ఘ సమయం పడుతోంది. అందుకే కృత్రిమంగా వజ్రాల తయారీ రోజురోజుకూ ఊపందుకుంటోంది.

New Update
diamonds: ఇక 150 నిమిషాల్లోనే కృత్రిమంగా వజ్రాలు!

వజ్రం.. ఖరీదైన నవరత్నాల్లో ఒకటి. భూమ్మీద సహజంగా లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో వజ్రం కూడా ఒకటి. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది.

కానీ ఫ్యాషన్ మార్కెట్ లో దీనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా సహజ డైమండ్లను వెలికితీసి సానబెట్టేందుకు సుదీర్ఘ సమయం పడుతోంది. అందుకే కృత్రిమంగా వజ్రాల తయారీ రోజురోజుకూ ఊపందుకుంటోంది. అయితే ఇందులోనూ చిన్న చిక్కు ఉంది. ఇప్పటివరకు ల్యాబ్ లో వజ్రాలను తయారు చేసేందుకు కొన్ని వారాల సమయం పడుతోంది. కానీ దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఓ సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయడం విశేషం.

ఈ కొత్త పద్ధతి ఇప్పటివరకు అవసరమవుతున్న భారీ పీడన ప్రక్రియను నివారించనుంది. పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని దక్షిణ కొరియాలోని ఇన్ స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ కు చెందిన పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ద్రవ లోహంలో కార్బన్ అణువులను కలపడం కొత్త ప్రక్రియ ఏమీ కానప్పటికీ ఇప్పటివరకు ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. కానీ కొత్త విధానంలో గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్ లను మీథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ చాంబర్ లో అత్యంత వేగంగా వేడి చేస్తారు. దీనివల్ల కార్బన్ అణువులు ద్రవ లోహంలో పారదర్శక స్పటికలుగా మారతాయి. కేవలం 15 నిమిషాల్లోనే డైమండ్ సీడ్స్ తయారవుతాయి. అలా మొత్తంగా 150 నిమిషాలకు వజ్రం ముక్కలు ఏర్పడతాయి.

వివిధ రంగాలకు అవసరమైన వజ్రాల ఉత్పత్తి పద్ధతిని ఈ టెక్నిక్ సమూలంగా మార్చేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు