Piracy Sites: పైరసీ సైట్లకు అడ్డుకట్ట పడేనా..? ప్రజల్లో పెరుగుతున్న ప్రశ్న!

పైరసీ సైట్లను బ్లాక్ చేయకపోవడంపై ప్రజల్లో ప్రశ్నలు పెరుగుతున్నాయి. iBomma అరెస్ట్ అయినా సమస్య పూర్తి కాలేదని, పైరసీ వల్ల నిర్మాతలు, ప్రభుత్వం నష్ట పోతున్నందున, కేంద్రం సీరియస్ చర్యలు తీసుకుంటే దేశవ్యాప్తంగా సైట్లు బ్లాక్ చేయవచ్చని ప్రజలు భావిస్తున్నారు.

New Update
Piracy Sites

Piracy Sites

Piracy Sites: కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు అదే రోజున పైరసీ సైట్లలో కనిపించడం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద సమస్యగా మారింది. ఇటీవల iBomma కు సంబంధించిన ఇమ్మడి రవి( i Bomma Imandi Ravi) అరెస్టు కావడంతో ఈ విషయం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. పోలీసులు రవిని ఎలా పట్టుకున్నారో వివరించిన సజ్జనార్, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మంచి ప్రశంసలు పొందారు.

అయితే, ఇప్పుడు ఒక న్యాయవాది రవిని వారం రోజుల్లో బయటకు తీసుకువస్తానని ప్రకటించడం మరింత చర్చకు దారి తీసింది. ఆయన మాట్లడుతూ- “రవికి ప్రజల్లో పెద్ద మద్దతు ఉంది, అందుకే నేను ముందుకొస్తున్నాను.” ఆశ్చర్యకరంగా, కొంతమంది అతడిని కూడా ప్రశంసించడం ప్రారంభించారు. ఈ నడుస్తున్న వివాదాన్ని పక్కన బెట్టి, అసలు ప్రశ్నపై ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

పైరసీ సైట్లపై కేంద్రస్థాయిలో చర్య ఎందుకు లేదు?

పైరసీ వల్ల నష్టపోయిన నిర్మాతలందరి నుంచి సాక్ష్యాలు, లిస్ట్, ఫిర్యాదులు సేకరించి సుప్రీం కోర్టులో కేసు వేసారా? దిల్ రాజు, లేదా కేంద్ర స్థాయిలో ప్రభావం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి నాయకులు ఈ అంశంపై ఎంతగా దృష్టిసారించారు?

దేశంలో పాకిస్తాన్‌కు చెందిన వార్తా ఛానెల్స్, యూట్యూబ్ చానెళ్లను ఒకేసారి బ్లాక్ చేసిన ఉదాహరణ మనకుంది. దేశం భద్రతకు హాని చేస్తే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని అది సాక్ష్యం.

అప్పుడు అదే విధంగా పైరసీ సైట్లను కూడా బ్లాక్ చేయడం ఎందుకు కుదరదు? సినిమా నిర్మాతలు నిజంగా భారీగా డబ్బు కోల్పోతే, అలాగే ప్రభుత్వం పన్నుల రూపంలో రాబడి కోల్పోతే, బలమైన కేసు వేయడానికి ఇదే సరైన కారణం కాదా? పోలీసులే చెబుతున్న ప్రమాదం అయితే అసలు ఆలస్యం ఎందుకు? పోలీసుల ప్రకారం పైరసీ సైట్లు అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు చూపిస్తాయి. వినియోగదారుల డేటాను దొంగిలించి డార్క్ వెబ్‌కు పంపుతాయి. సైబర్ నేరాలకు కారణమవుతాయి.

అయితే, ఇలాంటి సైట్లను ప్రభుత్వం వెంటనే "సుమోటో" (సుయో మోటో)గా ఎందుకు బ్లాక్ చేయలేదు? ఒక iBomma ని పట్టుకోవడం మాత్రమే సరిపోతుందా? ఇలాంటి సైట్లు మరెన్నో ఉన్నాయి. వాటిని ఒక్కసారిగా లీగల్‌గా మూసేయడానికి ప్రభుత్వానికి అధికారాలు లేవా?

సాధారణ ప్రజల సందేహం ఇదే

ఒక పైరసీ సైట్ నిర్వాహకుడిని అరెస్టు చేయడం మాత్రమే సరిపోదు. సమస్య మూలాన్ని అరికట్టడం అవసరం. దేశవ్యాప్తంగా వీటిని పూర్తిగా బ్లాక్ చేయడం ఎందుకు సాధ్యపడడం లేదు? నిపుణులు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

Advertisment
తాజా కథనాలు