Rao Bahadur Teaser: 'బాహుబలి రేంజ్ సినిమా'.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ ఇదిగో!

సత్యదేవ్ నటించిన ‘రావు బహదూర్’ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్న వ్యక్తి జీవితాన్ని విభిన్నంగా చూపించిన ఈ సైకాలజికల్ డ్రామాలో సత్యదేవ్ కొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది.

New Update
Rao Bahadur Teaser

Rao Bahadur Teaser

Rao Bahadur Teaser

Rao Bahadur Teaser: సత్యదేవ్(Satyadev) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రావు బహదూర్’ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ తమ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలను కూడా చేపట్టారు.

తాజాగా మూవీ టీమ్ విడుదల చేసిన “జస్ట్ ఎ టీజర్” ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది సాధారణ టీజర్‌లా కాకుండా కథలోని ప్రధాన పాత్ర జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన క్షణాలను చూపిస్తూ ముందుకు సాగుతుంది.

టీజర్ స్టార్టింగ్ లో వృద్ధాప్యంలో ఉన్న రావు బహదూర్‌కు లివర్ క్యాన్సర్ చివరి దశలో ఉందని వైద్యులు చెబుతారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అతడు జీవిస్తూనే ఉంటాడు. అక్కడి నుంచి అతని జీవితంలోని పలు దశలను టీజర్ చూపిస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రేమ కథ, జీవితాన్ని మార్చిన సంఘటనలు ఒక్కొక్కటిగా కనిపిస్తాయి.

ఈ సినిమాలో సత్యదేవ్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఒంటరితనం, మానసిక వేదన, జీవితంపై అనేక ప్రశ్నలతో పోరాడే వ్యక్తిగా ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఆయన లుక్, నటన, పాత్ర తీరు గత చిత్రాల కంటే భిన్నంగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

హీరోయిన్‌గా దీపా థామస్ నటిస్తుండగా, వికాస్ ముప్పాల, బాలా పరసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సాంకేతికంగా కూడా సినిమా మంచి స్థాయిలో ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్ రూపొందించిన సెట్స్ కథకు తగ్గట్టుగా సహజంగా కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ పరమార్ అందమైన విజువల్స్‌తో ప్రతి ఫ్రేమ్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. స్మరణ్ సాయి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథలోని మిస్టరీ, ఎమోషన్స్ ను మరింత బలంగా చూపిస్తోంది.

వెంకటేష్ మహా తన ప్రత్యేక శైలిలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ స్పష్టంగా చెబుతోంది. కథను నేరుగా చెప్పకుండా, పాత్ర మనసులోని భావాలను చూపించే విధానం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

మొత్తంగా చూస్తే, ‘రావు బహదూర్’ ఒక కొత్త తరహా సైకాలజికల్ డ్రామాగా కనిపిస్తోంది. బలమైన కథ, విభిన్నమైన పాత్రలు, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది. ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు