/rtv/media/media_files/2026/04/11/ranveer-2026-04-11-08-59-12.jpg)
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన కాంతార అనుకరణ వివాదం ఇప్పుడు కర్ణాటక హైకోర్టులో కీలక దశకు చేరుకుంది. గత ఏడాది గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో రణవీర్ సింగ్ రిషబ్ శెట్టి పోషించిన దైవ పాత్రను అనుకరిస్తూ.. ఒక దైవాన్ని ఫీమేల్ ఘోస్ట్ అని పిలవడం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక న్యాయవాది ఫిర్యాదు చేయడంతో రణవీర్ సింగ్‌పై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.
తాజాగా శుక్రవారం జరిగిన విచారణలో, రణవీర్ సింగ్ తరపు న్యాయవాది సజన్ పూవయ్య కోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించారు. అందులో రణవీర్ సింగ్ తన చర్యలకు చింతిస్తున్నానని, సంబంధిత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తానని పేర్కొన్నారు. అయితే, ఈ క్షమాపణ అఫిడవిట్‌లో నిజాయితీ లేదని, అది అస్పష్టంగా ఉందని ఫిర్యాదుదారు తరపు న్యాయవాది వాదించారు. కేవలం మొక్కుబడిగా క్షమాపణలు చెబితే సరిపోదని, పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించేలా మరో అఫిడవిట్ ఇవ్వాలని కోరారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని
దీనిపై స్పందించిన రణవీర్ తరపు న్యాయవాది, ఫిర్యాదుదారు సంతృప్తి చెందేలా క్షమాపణ పత్రాన్ని సవరించడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. తన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని తనకు తెలియదని, ఇప్పటికే సోషల్ మీడియాలో బేషరతుగా క్షమాపణలు చెప్పానని రణవీర్ తరపున కోర్టుకు వివరించారు. ఈ పరిణామాలను పరిశీలించిన జస్టిస్ ఎం. నాగప్రసన్న.. ఫిర్యాదుదారు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, సరికొత్త అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రణవీర్ సింగ్‌ను ఆదేశించారు.
ఈ కేసు విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటిలోగా సవరించిన క్షమాపణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. గోవా ఈవెంట్‌లో 'కాంతార' గెటప్‌తో స్టేజ్ మీద రణవీర్ చేసిన సందడి భక్తుల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోర్టు సూచించిన విధంగా ఆయన ఇచ్చే క్షమాపణతో ఈ వివాదానికి ముగింపు పడుతుందో లేదో చూడాలి.
Follow Us