/rtv/media/media_files/2026/05/15/peddi-release-update-2026-05-15-15-18-22.jpg)
Peddi Release Update
Peddi Release Update: తెలుగు సినిమా రంగంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య గత కొన్ని రోజులుగా థియేటర్లలో రెంటల్ విధానం, పర్సంటేజ్ విధానం గురించి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఏ విధానం కొనసాగాలనే విషయంలో ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మే 15న తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం జరిగింది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, థియేటర్ల పరిస్థితి, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు.
ఈ సమావేశం అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. రెంటల్, పర్సంటేజ్ విధానాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదట 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం వచ్చినప్పటికీ, తర్వాత మొత్తం 18 మంది సభ్యులతో కమిటీ ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో నిర్మాతల నుంచి 6 మంది, డిస్ట్రిబ్యూటర్ల నుంచి 6 మంది, ఎగ్జిబిటర్ల నుంచి 6 మంది సభ్యులు ఉంటారు.
నిర్మాతల విభాగం నుంచి ఎంపికైన సభ్యులలో ప్రసన్న కుమార్, సుప్రియ, మైత్రి రవి, సుధాకర్ చెరుకూరి, బాపినీడు, ఎస్‌కేఎన్ ఉన్నారు. మిగతా వర్గాల సభ్యులను కూడా త్వరలో ఖరారు చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు(Dil Raju) మాట్లాడుతూ, ఫిల్మ్ ఛాంబర్‌లో అన్ని వర్గాలతో చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పారు. పర్సంటేజ్ విధానంపై నిర్ణయం తీసుకునే ముందు ఏ, బి, సి సెంటర్ల పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు. ప్రతి ప్రాంతంలో థియేటర్ల పరిస్థితి వేరుగా ఉండటంతో అందరికీ ఉపయోగపడేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అలాగే జూన్ 4న విడుదల కానున్న 'పెద్ది' సినిమాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని దిల్ రాజు స్పష్టం చేశారు. దీంతో సినిమా విడుదలపై వస్తున్న అనుమానాలకు క్లారిటీ వచ్చింది.
ఇక మరో రెండు నెలల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న రెంటల్, పర్సంటేజ్ విధానాలు కొనసాగనున్నాయి. ఈ వ్యవధిలో కమిటీ అన్ని అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ వివాదంలో ఒకవైపు శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాసరావు ఉండగా, మరోవైపు నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు.
సినిమా పరిశ్రమలో అన్ని వర్గాల మధ్య మంచి అవగాహన ఉండేలా ఈ సమావేశం ఉపయోగపడిందని ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తెలిపారు. త్వరలో కమిటీ తుది నివేదిక ఇవ్వనుండగా, దాని ఆధారంగా థియేటర్లలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Follow Us