Pradeep Ranganathan: ‘డ్యూడ్’ కాంబో రిపీట్.. మరోసారి మ్యాజిక్ జరుగుతుందా?

ప్రదీప్ రంగనాథన్ నిర్మాణంలో మమితా బైజు హీరోయిన్‌గా ఓ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ‘డ్యూడ్’ తర్వాత వీరి కాంబో మళ్లీ వస్తుండగా, ఈసారి ఫిమేల్ సెంట్రిక్ కథతో సినిమా రూపొందనుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం.

New Update
Pradeep Ranganathan

Pradeep Ranganathan

Pradeep Ranganathan: తమిళ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తర్వాత హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలతోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించాడు.

ఇటీవల ఆయన నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ప్రదీప్ మరో కొత్త ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచాడు.

‘డ్యూడ్’ సినిమాలో తనతో కలిసి నటించిన మమితా బైజును హీరోయిన్‌గా పెట్టి ఒక కొత్త సినిమా నిర్మించేందుకు ప్రదీప్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆసక్తికర విషయం ఏమిటంటే, ‘డ్రాగన్’ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు.

‘డ్యూడ్’ సినిమాలో ప్రదీప్ - మమితా జంటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీరిద్దరూ మళ్లీ కలిసి నటించాలని అభిమానులు కోరుకున్నారు. అయితే ఈసారి సినిమా పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఒక మహిళా ప్రధాన కథతో తెరకెక్కనున్న సినిమా అని టాక్. ఇందులో మమితా బైజు ఇప్పటివరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించనుందట. అలాగే అశ్వత్ మారిముత్తు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తున్నారనే విషయం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుతం ప్రదీప్, మమితా, అశ్వత్ ముగ్గురూ మంచి క్రేజ్‌లో ఉన్నారు. దీంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు