/rtv/media/media_files/2026/03/13/prem-rakshith-2026-03-13-18-09-42.jpg)
Prem Rakshith
Prem Rakshith: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు ఇప్పుడు మరో పెద్ద అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మైఖేల్ జాక్సన్‌తో పనిచేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విన్సెంట్ ప్యాటర్సన్, ప్రేమ్ రక్షిత్ టాలంట్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
విన్సెంట్ ప్యాటర్సన్ అంటే ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి పెద్ద అంతర్జాతీయ కళాకారులతో కలిసి ఆయన పనిచేశారు. ‘స్మూత్ క్రిమినల్’ వంటి ఫేమస్ పాటలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. అలాంటి వ్యక్తి ప్రేమ్ రక్షిత్ ప్రతిభను మెచ్చుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
ఇటీవల విన్సెంట్ ప్యాటర్సన్ ప్రేమ్ రక్షిత్‌కు ఒక వీడియో సందేశం పంపారు. అందులో “హలో ప్రేమ్… మీ కొరియోగ్రఫీ చాలా బాగుంది. నేను మీ పనిని చాలా మెచ్చుకున్నాను. మీరు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది. త్వరలోనే మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నాను” అని చెప్పారు.
ఈ వీడియో ను ప్రేమ్ రక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. చిన్నప్పటి నుండి తాను మైఖేల్ జాక్సన్ అభిమానినని ఆయన చెప్పారు. ముఖ్యంగా ‘స్మూత్ క్రిమినల్’ పాట తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అలాంటి పాటకు కొరియోగ్రఫీ చేసిన విన్సెంట్ ప్యాటర్సన్ నుంచి ప్రశంసలు రావడం తన జీవితంలో చాలా ప్రత్యేకమైన క్షణమని ప్రేమ్ రక్షిత్ ఆనందం వ్యక్తం చేశారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/03/13/rana-insta-post-2026-03-13-18-12-11.jpeg)
ఈ విషయంపై నటుడు రానా దగ్గుబాటి కూడా స్పందించారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ వీడియోను షేర్ చేస్తూ, ఇది భారతీయ కొరియోగ్రఫీకి వచ్చిన గొప్ప గుర్తింపు అని పేర్కొన్నారు.
చెన్నైలో చిన్న స్థాయిలో ప్రారంభమైన ప్రేమ్ రక్షిత్ ప్రయాణం ఇప్పుడు ప్రపంచం గుర్తించే స్థాయికి చేరింది. ‘ఛత్రపతి’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమాల్లో ఆయన చేసిన కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి పాటలో ఆయన రూపొందించిన స్టెప్స్ ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి.
తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటివరకు దాదాపు 200 సినిమాలకు ప్రేమ్ రక్షిత్ పనిచేశారు. ఒకప్పుడు మైఖేల్ జాక్సన్ స్టెప్స్ చూసి ప్రేరణ పొందిన ఆయన, ఇప్పుడు అదే జాక్సన్‌తో పనిచేసిన కొరియోగ్రాఫర్ నుంచి ప్రశంసలు పొందడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.
‘నాటు నాటు’ పాట ఇప్పటికే ఆస్కార్ అవార్డు గెలుచుకుని భారతీయ సినిమా ప్రతిష్టను ప్రపంచానికి తెలియజేసింది. ఇప్పుడు వచ్చిన ఈ ప్రశంసలు ప్రేమ్ రక్షిత్ ప్రతిభకు మరో అంతర్జాతీయ గుర్తింపుగా మారాయి.
Follow Us