NTR 103rd Birth Anniversary: “జై ఎన్టీఆర్” నినాదాలతో మార్మోగిన ఘాట్.. తాతయ్యకు తారక్ ఘన నివాళి!

ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తాతయ్యకు నివాళులు అర్పించారు. అభిమానుల నినాదాల మధ్య పూలమాల వేసి ప్రార్థనలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, రాజకీయ నేతలు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

New Update
NTR 103rd Birth Anniversary

NTR 103rd Birth Anniversary

NTR 103rd Birth Anniversary: తెలుగు ప్రజల అభిమాన నేత, నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం నుంచే భావోద్వేగ వాతావరణం కనిపించింది.

జూనియర్ ఎన్టీఆర్ గురువారం తెల్లవారుజామున ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానుల మధ్యులో నడుచుకుంటూ వెళ్లిన తారక్, తన తాతయ్య సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చేతులు జోడించి ప్రార్థనలు చేసి, కొద్దిసేపు అక్కడే మౌనంగా కూర్చుని తాతయ్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

డెనిమ్ షర్ట్‌లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. “జై ఎన్టీఆర్”, “అన్నా” అంటూ అభిమానులు నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేసిన తారక్, తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రతి సంవత్సరం మే 28న ఎన్టీఆర్ జయంతి రోజు, జనవరి 18న వర్ధంతి రోజు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించడం జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటినుంచో కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తాతయ్యకు నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా వచ్చారు.

తారక్‌తో పాటు ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, లక్ష్మీ పార్వతి, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు.

ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎంతో ప్రభావం చూపిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 300కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా సేవలందించారు. తెలుగు గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేతగా ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు, పోస్టర్లు షేర్ చేస్తూ ఆయనను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను పూలతో అందంగా అలంకరించారు. భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు