Band Melam Review: మోగని "బ్యాండ్ మేళం".. సినిమా ఎలా ఉందంటే..?

బ్యాండ్ మేళం ఒక రొటీన్ లవ్ స్టోరీ. హర్ష్ రోషన్, శ్రీదేవి నటన, సంగీతం కొంతవరకు ఆకట్టుకుంటాయి. కానీ పాత కథ, కొత్తదనం లేకపోవడం, బోరింగ్ 2న్డ్ హాఫ్ వల్ల సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. మొత్తం మీద ఇది ఒక డిస్సపాయింటింగ్ లవ్ స్టోరీ.

New Update
Band Melam Review

Band Melam Review

Band Melam Review

సినిమా పేరు: బ్యాండ్ మేళం
విడుదల తేదీ: మార్చి 26, 2026
నటీనటులు: హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా, సాయి కుమార్ తదితరులు
దర్శకుడు: సతీష్ జవ్వాజీ

కథ:

యాదగిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి) చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన కజిన్స్. చిన్ననాటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. రాజి చదువులో మంచి ప్రతిభ చూపుతుంది, కానీ యాదగిరి చదువు మధ్యలోనే వదిలేస్తాడు. కాలం గడిచేకొద్దీ రాజి తన జీవితంలో ముందుకు వెళ్లిపోతుంది, యాదగిరిని మరిచిపోతుంది. కానీ యాదగిరి మాత్రం ఆమెను మర్చిపోలేడు. ఆమెను తిరిగి పొందాలని, జీవితంలో ఎదగాలని సంగీత రంగంలో పేరు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. అతని ప్రయాణం ఎలా సాగుతుంది? చివరికి ప్రేమ సాధిస్తాడా? అనేదే కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరూ కొత్తవాళ్లే అయినా తమ పాత్రల్లో బాగానే నటించారు. హర్ష్ రోషన్ గ్రామీణ యువకుడిగా సహజంగా కనిపించాడు. అతని అమాయకత్వం, సరదా నడవడిక ఆకట్టుకుంటాయి. శ్రీదేవి అపల్లా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది.

మొదటి భాగంలో కొంత కామెడీ ఉంది. కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. హీరో ఫ్రెండ్స్ పాత్రలు కూడా బాగున్నాయి. చివర్లో వచ్చే “తిప్పుకుంటున్నావ్” పాట ప్రేక్షకులను అలరిస్తుంది. సంగీతం ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకి ప్రధాన లోపం కథలో కొత్తదనం లేకపోవడం. ఇలాంటి కథలు ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కథనం కూడా అంత ఆసక్తికరంగా లేదు.

మొదటి భాగం కొంచెం బాగానే ఉన్నా, రెండో భాగం చాలా నెమ్మదిగా సాగుతుంది. బోర్ కొట్టే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కథ ముందుకు వెళ్లకుండా లాగినట్టు అనిపిస్తుంది. సినిమా చిన్నదే అయినా ఎక్కువ సేపు చూస్తున్న భావన కలుగుతుంది.

సాయి కుమార్ లాంటి అనుభవజ్ఞులైన నటులకు సరైన పాత్ర ఇవ్వలేదు. కొన్ని ఎమోషన్ సన్నివేశాలు కూడా ప్రభావం చూపలేకపోయాయి. చివర్లో వచ్చే ట్విస్ట్ కొత్తగా అనిపించినా, దాన్ని బలంగా చూపించలేకపోయారు.

సాంకేతిక అంశాలు:

సంగీత దర్శకుడు మంచి పాటలు ఇచ్చాడు. మూడు పాటలు వినడానికి బాగుంటాయి. సినిమాటోగ్రఫీ సాధారణంగా ఉంది. నిర్మాణ విలువలు ఓకే ఓకే..

కానీ ఎడిటింగ్ వీక్ గా ఉంది. స్క్రీన్‌ప్లే కూడా అంతగా ఆకట్టుకోలేదు. దర్శకుడు మొదటి భాగాన్ని కొంత బాగానే తీశాడు కానీ రెండో భాగంలో ఆసక్తి తగ్గిపోయింది.

మొత్తంగా చూసుకుంటే, బ్యాండ్ మేళం ఒక సాధారణ ప్రేమ కథ. హీరో, హీరోయిన్ నటన, సంగీతం కొంత వరకు మెప్పిస్తాయి. కానీ పాత కథ, బోరింగ్ 2న్డ్ హాఫ్, ఎమోషన్స్ లోపం కారణంగా సినిమా పెద్దగా ఆకట్టుకోదు. ఒకసారి చూడాలనిపించినా, ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా చూడటం మంచిది.

Advertisment
తాజా కథనాలు