50 Years Bhakta Kannappa: వావ్... ‘భక్త కన్నప్ప’కు 50 ఏళ్లు.. అడవుల్లో 90% షూటింగ్, ఒక్క ఆదివారం మాత్రమే రెస్ట్!

కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ విడుదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. హాలీవుడ్ రేంజ్ భక్తి చిత్రం చేయాలన్న ఆలోచనతో రూపొందిన ఈ సినిమా ఎక్కువగా అడవుల్లో షూట్ చేశారు. 500 మందితో 70 రోజులు చాలా కష్టంగా చిత్రీకరణ జరిగింది. 100 రోజులు విజయవంతంగా నడిచిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్‌గా నిలిచింది.

New Update
50 Years Bhakta Kannappa

50 Years Bhakta Kannappa

50 Years Bhakta Kannappa: తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన భక్తి చిత్రం “భక్త కన్నప్ప” విడుదలై నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు(Krishnam Raju) నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. భక్తి, ఎమోషన్స్, భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచింది. ఈ విజయానికి వెనుక ఎన్నో కష్టాలు, ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

కృష్ణంరాజుకు హాలీవుడ్ స్థాయి పౌరాణిక సినిమాలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా “బెన్ హర్”, “ది టెన్ కమాండ్మెంట్స్” వంటి చిత్రాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. అలాంటి స్థాయిలో ఒక గొప్ప భక్తి చిత్రం తెలుగులో చేయాలన్న ఆలోచనతో “భక్త కన్నప్ప” ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

మొదట ఈ సినిమాను దర్శకుడు మధుసూదనరావుతో చేయాలని అనుకున్నారు. కొన్ని పాటల రికార్డింగ్ కూడా పూర్తయింది. కానీ ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో దర్శకుడు బాపు పేరు పరిశీలనలోకి వచ్చింది. కృష్ణంరాజు స్వయంగా బాపును కలిసి కథ చెప్పారు. కథలో మార్పులు చేసి రచయిత ముళ్లపూడి వెంకటరమణ సహాయంతో స్క్రిప్ట్‌ను మరింత బలంగా మార్చారు.

ఈ సినిమా కృష్ణంరాజు కెరీర్‌లో 77వ చిత్రం కాగా, బాపు దర్శకత్వంలో 10వ చిత్రం కావడం విశేషం.

సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, గుటాల అటవీ ప్రాంతాల్లో దాదాపు 70 రోజులు చిత్రీకరణ చేశారు. అప్పట్లో ఇప్పటి లాంటి సౌకర్యాలు లేకపోవడంతో షూటింగ్ చాలా కష్టంగా సాగింది. అవసరమైన వస్తువుల కోసం రోజూ విజయవాడకు ప్రయాణించాల్సి వచ్చేది. ఏ వస్తువు అందుబాటులో లేకపోతే ఆ రోజు షూటింగ్ ఆగిపోయేది.

ఈ సమస్యల కారణంగా యూనిట్ సభ్యులు అక్కడే చిన్న వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. కార్పెంటర్లు, టైలర్లు, సెట్ వర్కర్లు అవసరమైన వస్తువులను అక్కడే తయారు చేసేవారు. సుమారు 500 మంది యూనిట్ సభ్యులు ఈ ప్రాజెక్ట్‌లో పని చేశారు.

షూటింగ్ షెడ్యూల్‌లో వారానికి ఆరు రోజులు పని చేసి, ఆదివారం మాత్రమే రెస్ట్ తీసుకునేవారు. బుట్టాయిగూడెం నుంచి షూటింగ్ ప్రాంతం దాదాపు 15 మైళ్ల దూరంలో ఉండేది. రోడ్లు కూడా సరిగా లేకపోవడంతో ప్రయాణం చాలా కష్టంగా ఉండేది.

సినిమా బడ్జెట్ అప్పట్లో భారీగా రూ.20 లక్షల వరకు వెళ్లింది. కానీ కృష్ణంరాజు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.

విడుదలైన తర్వాత “భక్త కన్నప్ప” అన్ని కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కృష్ణంరాజు నటన, బాపు దర్శకత్వం, సంగీతం అన్నీ కలిసి సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి.

ఈ కథకు మూలం 1954లో వచ్చిన కన్నడ చిత్రం “బెడర కన్నప్ప”. దానిని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి ఈ సినిమాను రూపొందించారు.

ప్రస్తుతం కూడా “భక్త కన్నప్ప” ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో అందుబాటులో ఉంది. కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ క్లాసిక్ సినిమాను చూస్తున్నారు. అలాగే అదే కథ ఆధారంగా మంచు విష్ణు నటించిన “కన్నప్ప” సినిమా కూడా ఇటీవల చర్చలో నిలిచింది.

అయితే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం కృష్ణంరాజు నటించిన “భక్త కన్నప్ప”కి ఉన్న స్థానం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు