సీజేఐ అధికారాలకు కత్తెర : మరో వివాదాస్పద బిల్లుకు రంగం సిద్ధం

కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద బిల్లుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి. కమిషనర్లను నియమించే సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించే చట్టాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది.

New Update
సీజేఐ అధికారాలకు కత్తెర :  మరో వివాదాస్పద బిల్లుకు రంగం సిద్ధం

సీజేఐకు మినహాయింపు..

ఇప్పటికే కొలిజీయం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేంద్రం మరో వివాదాస్పద చట్టం తీసుకురావడానికి సిద్ధమైంది. సీఈసీ, కమిషనర్లను నియమించే సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించే చట్టాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల కమిషనర్ల ఎంపికను ప్రధాని, లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర మంత్రితో కూడిన ప్యానెల్ పర్యవేక్షిస్తుందని ప్రతిపాదిత బిల్లు పేర్కొంది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొనాలని ఈ ఏడాది మార్చిలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది.

రాజ్యసభలో బిల్లు లిస్ట్.. 

జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పులో.. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై పార్లమెంటు చట్టం రూపొందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా తాజా బిల్లును తీసుకురానుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల బిల్లు-2023ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. ఈ బిల్లులో సీజీఐని తొలగించింది. ఎన్నికల సంఘం నియామకాలను త్రిసభ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించాలని బిల్లులో ప్రతపాదించారు.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు..

అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలతో పాటు మాజీ న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎన్నికల సంఘాన్ని నియంత్రించాలని భావిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇది ప్రమాదకరమైన నిర్ణయమని.. దేశ ఎన్నికల పారదర్శకతపై ప్రభావం చూపుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. స్వతంత్ర వ్యవస్థ అయిన ఈసీని ఈ బిల్లు ద్వారా తమ చేతిలో కీలుబొమ్మలా పెట్టుకోవాలని కేంద్రం చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఒకవేళ పార్లమెంటు ఆమోదించినా, తన దృష్టిలో ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని.. దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశం ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. పరిపాలన ప్రక్రియలో న్యాయబద్ధత ఉండేలా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో కచ్చితంగా ప్రధాన న్యాయమూర్తి ఉండాలని డిమాండ్ చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఈ బిల్లుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు