BJP: వాళ్లను గెలిపించి వీళ్లు ఓడారు.. తెలంగాణ బీజేపీలో విచిత్రం

ఎంపీలుగా ఉన్న బీజేపీ రాష్ట్ర నేతలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాపూరావు ఇద్దరూ తమ పరిధిలో అభ్యర్థులను గెలిపించుకునీ అనూహ్యంగా తామే ఓటమి పాలయ్యారు. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలోని నాలుగు, పూర్వ నిజామాబాద్‌ జిల్లాలోని మూడు స్థానాల్లో బీజేపీ జెండా పాతింది.

New Update
BJP: వాళ్లను గెలిపించి వీళ్లు ఓడారు.. తెలంగాణ బీజేపీలో విచిత్రం

Telangana Elections BJP: తెలంగాణ ఎన్నికల్లో కొన్ని చోట్ల విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంపీలుగా ఉన్న బీజేపీ రాష్ట్ర నేతలు ధర్మపురి అర్వింద్‌ (Arvind Dharmapuri), సోయం బాపూరావు (Soyam Bapurao) ఇద్దరూ తమ పరిధిలో అభ్యర్థులను గెలిపించుకునీ, అనూహ్యంగా తామే ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో బీజేపీ ఈ సారి ఓటు బ్యాంకును రెట్టింపు చేసుకుని, ఒకటి నుంచి 8 సీట్లకు చేరుకుంది. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలోని నాలుగు, పూర్వ నిజామాబాద్‌ జిల్లాలోని మూడు స్థానాల్లో బీజేపీ జెండా పాతింది. ఉత్తర తెలంగాణలోని చాలా స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా.. భారీగా ఓట్లు, మెరుగైన సీట్లు

ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగురామన్నపై పాయల్‌ శంకర్‌ విజయం సాధించగా, నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై మహేశ్వర్‌ రెడ్డి గెలుపొందారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వినయ్‌కుమార్‌ రెడ్డిపై పైడి రాకేశ్‌ రెడ్డి; నిజామాబాద్‌ అర్బన్‌లో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీపై ధనపాల్‌ సూర్యనారాయణ విజయం సాధించారు. ముథోల్‌లో విఠల్‌ రెడ్డిపై బీజేపీ (BJP) అభ్యర్థి రామారావు పటేల్‌; సిర్పూర్‌లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. గోషామహల్‌లో మరోసారి రాజాసింగ్‌ విజయభేరి మోగించారు. కామారెడ్డిలోనైతే ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఢీకొట్టి ఓడించారు.

నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్‌ ఈ ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన కోరుట్ల నుంచి పోటీలో దిగారు. పసుపు బోర్డు హామీ, బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ అంశాలను బాగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ అర్బన్ టిక్కెట్‌ ధనపాల్ సూర్యనారాయణకు, ఆర్మూర్ నుంచి పైడి రాకేశ్‌ రెడ్డికి ఏరికోరి టికెట్ ఇప్పించి వారి విజయం కోసం విశేషంగా కృషిచేశారు. ఫలితంగా వారు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక కామారెడ్డిలో సంచలనం తెలిసిందే. అయితే, మూడు స్థానాలనూ గెలిపించుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అర్వింద్‌ తాను మాత్రం రాజకీయ జీవితంలో తొలి ఓటమి చవిచూశారు. కోరుట్లలో అర్వింద్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఇక పూర్వ ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లాలో అయితే బీజేపీ ఏకంగా నాలుగు స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీ విజయం సాధించిన సగం స్థానాలు ఆ జిల్లాలోనివే కావడం విశేషం. అయితే, ఆదిలాబాద్‌ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు మాత్రం బోథ్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి రెండో స్థానానికే పరిమితమయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో 23వేల ఓట్ల తేడాతో ఆయనకు అపజయం ఎదురైంది.

ఇది కూడా చదవండి: మా పోరాటం కాంగ్రెస్ కు కలిసొచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన ఎంపీలు మాత్రం విజయం సాధించడం గమనార్హం. ఎంపీలుగా ఉన్న రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మంచి మెజార్టీతో ప్రత్యర్థులపై విజయం సాధించారు. వీరే కాకుండా బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి కూడా దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు