వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనలో పలువురు అధికారులను బాధ్యలుగా చేస్తూ సస్పెండ్ చేశారు. ఇందులో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కమీషనర్ గౌతమి, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్‌ఫై లపై బదిలీ వేటు పడగా... డీఎస్పీ రమణ కుమార్..గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నామని సీఎం ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
ఒకరికి కంట్రాక్టు ఉద్యోగం
తిరుమలలో భక్తుల తొక్కిసలాసట ఘటనపై సీఎం టీటీడీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాల్లో ఒకరికి కంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు రూ. 5లక్షలు, గాయడిన 33 మందికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లుగా చెప్పారు. తిరుమల పవిత్రను కాపాడుతామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అంతేకాకుండా 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు.
తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డానన్న సీఎం చంద్రబాబు ఈ ఘటనపై అధికారులతో సమీక్ష నిర్వహించానని తెలిపారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరగకూడని సంఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించామని.. బాధితులతో మాట్లాడటం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. వైకుంఠ ఏకాదశిలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారని.. ఆ రోజున దర్శిస్తే వైకుంఠానికి వెళ్తాం అనేది భక్తుల విశ్వాసమని చెప్పారు. తిరుమలలో ప్రక్షాళన చేయాలని ఈవోకు ఆదేశాలు గతంలోనే జారీ చేశామన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తలో ఇలాంటి ఘటనలు జరగకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని, కొన్ని సూచనలు చేశానని చెప్పుకొచ్చారు. తన సూచనలు బోర్డులో చర్చించి అమలు చేస్తారని వెల్లడించారు సీఎం. దివ్యక్షేత్రం పవిత్రను కాపాడటానికి మనస్ఫూర్తిగా పనిచేస్తామని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా అధికారులపై పవన్ ఫైరయ్యారు.
Also Read : సినిమాలకు గుడ్ బై చెప్పేస్తా అంటున్న నిత్యా మీనన్.. కారణం అదేనట!