/rtv/media/media_files/2025/02/26/XQmyGXGt6xdWo45P1qIn.jpg)
TDP MLC Candidates Final List
ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందులో మొత్తం ఐదు స్థానాలు కూడా కూటమికే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో ఎవరికి అవకాశం ఎవరిని వరిస్తుందోననే చర్చ జోరుగా సాగుతోంది. జనసేన నుంచి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయం జరిగినట్లు కూటమి వర్గాల్లో చర్చ సాగుతోంది. మిగిలిన మూడు టీడీపీకి దక్కనున్నాయి. ఈ మూడు స్థానాల కోసం టీడీపీ నుంచి ఆరుగురు కీలక నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ లిస్ట్ లో దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, బీద రవీంద్ర, మోపిదేవి వెంకటరమణ, వంగవీటి రాధా, మంతెన సత్యనారాయణ ఉన్నారు.
దేవినేనికి పక్కా..
మైలవరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి... మంత్రిగా కూడా పని చేసిన సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాలతో పోటీ నుంచి దూరంగా ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు టీడీపీ అక్కడ అవకాశం ఇచ్చింది. దీంతో దేవినేని ఉమాకు ఎమ్మెల్సీగా ఛాన్స్ పక్కా అన్న ప్రచారం సాగుతోంది. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన బుద్ధా వెంకన్న గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ పై తీవ్రంగా పోరాటం చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా.. ఆయనకు ఛాన్స్ దక్కలేదు. దీంతో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆయన హైకమాండ్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది.
మరో సీనియర్ నేత బీద రవీంద్ర పేరును బీసీ కోటాలో చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్న మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా అవకాశం రావడం ఖాయమన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో సాగుతోంది. వైసీపీని వీడే సమయంలో రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆయన వదులుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రేసులో రాధా?
వంగవీటి రాధాకు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారం సాగుతోంది. కాపు సామాజిక వర్గంలో కీలక నేత.. బలమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న రాధా.. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కూటమి విజయం కోసం పని చేశారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలన్న చర్చ టీడీపీలో సాగుతున్నట్లు తెలుస్తోంది. మంతెన సత్యనారాయణ రాజు కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
అయితే.. పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఈ సారి కూడా నిరాశే మిగిలే అవకాశం ఉంది. సమీకరణాల దృష్ట్యా ఆయన పేరును టీడీపీ హైకమాండ్ ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలు, లేదా గవర్నర్ కోటాలో వర్మకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.