Daily Worker Success Story: డాక్టరేట్ సాధించిన మహిళా కూలీ.. ఈమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం చదవాలనే తపన ఉండాలేగానీ కష్టాలేవి ఆటంకాలు కావని నిరూపించింది ఓ తెలుగు మహిళ. పట్టుదలతో శ్రమించాలేగానీ తలరాతను కూడా జయించవచ్చని తెలియజేసింది. పేదరికాన్ని ఓడించాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మింది. అందుకే కూలీ పనులు చేస్తూ కూడా సగర్వంగా పీహెచ్‌డీ పట్టా అందుకుంది. By BalaMurali Krishna 18 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి కూలీ పనులు చేసుకుంటూనే పీహెచ్‌డీ.. చదువు సంస్కారం ఒక్కటే నేర్పించదు. బంగారు భవిష్యత్‌ను అందిస్తుంది. అందుకే పెద్దలు పిల్లలకు బాగా చదువుకోండి అని చెబుతుంటారు. పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు చదువు చెప్పించండని అంటుంటారు. ఎందుకంటే ఆస్తులు ఇస్తే కరిగిపోతాయి. అదే చదువు చెప్పిస్తే చనిపోయే వరకు మనతోనే ఉంటుంది. అయితే ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆశ ఉన్నా కొంతమందికి ఆర్థిక స్థోమత లేక అక్కడే ఆగిపోతుంటారు. మరి ముఖ్యంగా అమ్మాయిలైతే ఇక చదివింది చాలులే పెళ్లి చేసుకో అని బలవంతపెడుతుంటారు. అలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని పిల్లలు కన్న ఓ మహిళ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఏకంగా పీహెచ్‌డీ పట్టానే అందుకుంది. ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి.. అనంతపురం జిల్లా శింగనమల మండలానికి చెందిన సాకే భారతికి చిన్నపటి నుంచి చదువుంటే ఎంతో ఇష్టం. కానీ కుటుంబసభ్యులకు చదివించే స్థోమత లేకపోవడంతో ఇంటర్‌తోనే చదువు ఆపేసింది. తర్వాత మేనమామ శివ ప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే ఆమె మాత్రం నిరాశ చెందలేదు. చదువు పట్ల తనకున్న ప్రేమను భర్తకు తెలియజేసింది. అతడు కూడా ప్రోత్సహించడంతో కూలీ పనులు చేసుకుంటూనే అనంతరపురలోని ఎస్‌ఎస్‌బీఎన్ కాలేజీలో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. తన గ్రామం నుంచి కాలేజీకి వెళ్లాలంటే 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. అయితే రవాణా ఖర్చులు భరించలేక ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్లి అక్కడ బస్కుఎక్కేది. కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్ పట్టా.. డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే కూతురు పుట్టింది. ఇటు కూతురు ఆలన చూసుకుంటూ అటు కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్తూ మధ్యలో చదువుకుంటూనే పీజీ మంచి మార్కులతో పాస్ అయింది. అనంతరం పీహెచ్‌డీ చేయాలని అధ్యాపకులు ప్రోత్సహించడంతో అటు వైపు బలంగా అడుగులు వేసింది. ఈ ప్రయత్నంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎంసీఎస్ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్’అంశంపై పరిశోధనకు అవకాశం వచ్చింది. కూలీ పనులు చేయగా వచ్చే డబ్బులతో పాటు ఉపకార వేతనం ఆమెకు ఎంతో సాయపడింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే కెమిస్ట్రీలో డాక్టరేట్ పొందింది. దీంతో ఇటీవల జరిగిన శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గర్వంగా పీహెచ్‌డీ పట్టా అందుకుంది. పట్టా అందుకుంటున్న భారతిని చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. నేటి యువతకు భారతి కథ స్ఫూర్తిదాయకం.. నేటి యువత ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎన్నో అవకాశాలున్నా.. తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చదివించే స్థితిలో ఉన్నా.. చదువును నిర్లక్ష్యం చేస్తూ ఇతర అనవసరమైన వ్యాపకాలకు ఆకర్షితులవుతున్నారు. ఆర్థిక స్థోమత లేకున్నా.. సరైన వసతులు లేకున్నా.. కూలీ పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితుల్లో కూడా చదువుపైనే శ్రద్ధ పెట్టి ఏకంగా పీహెచ్‌డీ సాధించిన భారతి జీవితకథను స్ఫూర్తిగా తీసుకోవాలి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి