బీజేపీలోకి ఆ నలుగురు... బీఆర్‌ఎస్‌ కు పెద్ద షాక్‌

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు నాలుగు నియోజకవర్గాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు కీలక నేతలు రేపు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు.

New Update
బీజేపీలోకి ఆ నలుగురు... బీఆర్‌ఎస్‌ కు పెద్ద షాక్‌

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు నాలుగు నియోజకవర్గాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు కీలక నేతలు రేపు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి రేపు బీజేపీలో చేరనున్నారు. రానున్న ఎన్నికల్లో రామగుండం బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు సంధ్యారాణి. కానీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చందర్‌కే మరోసారి కేసీఆర్ టికెట్‌ ఇవ్వడంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ రామగుండం అభ్యర్థిగా పోటీలోకి దిగనున్నట్లు సమాచారం.

అలాగే మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత ఆరేపల్లి మోహన్‌ బీజేపీ కండువా కప్పుకోనున్నారు. రేపు బండి సంజయ్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు బుధవారం నాడు బండి సంజయ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఆరేపల్లితో పాటు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. 2009లో ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మానకొండూర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2024లో తనకు మానకొండూర్ గానీ, చొప్పదండి టికెట్ గానీ కేటాయిస్తారని ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మానకొండూర్ బీజేపీ టికెట్ ఆయనకే కేటాయించే అవకాశం ఉంది.

ప్రముఖ ముదిరాజ్‌ నాయకుడు సంగారెడ్డి జిల్లా పఠాన్‌ చెరుకు చెందిన బీఆర్‌ఎస్‌ నేత నీలం మధు ముదిరాజ్ రేపు బీజేపీలో చేరనున్నారు. మధు పఠాన్‌ చెరు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారు. కానీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే సీటు కేటాయించడంతో ప్రస్తుతం ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ లో జరిగిన ముదిరాజ్‌ కుల సమావేశంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో నీలం మధుకు మంచి పరిచయాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్‌లకు బీఆర్‌ఎస్‌ అన్యాయం చేసిందని నీలం మధు కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పఠాన్‌ చెరు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. వీరితో పాటు జనగామకు చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ బిక్షపతి రేపు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈయన కూడా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు