ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విజయశాంతి మంత్రి కాబోతున్నారా? అత్యంత కీలకమైన హోంశాఖను రాములమ్మకు అప్పగించాలని హైకమాండ్ డిసైడ్ అయ్యిందా? కేసీఆర్ ఫ్యామిలీ దూకుడు అడ్డుకోవడమే లక్ష్యంగా విజయశాంతిని కాంగ్రెస్ మళ్లీ యాక్టీవ్ చేసిందా? కాంగ్రెస్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు ఔను అనే సమాధానం వినిపిస్తోంది. నిన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆమె కేసీఆర్ ఫ్యామిలీపై చేసిన విమర్శలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
ఇటీవల తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఎమ్మెల్సీ రేసులో దాదాపు రెండు డజన్లకు పైగా పేర్లు వినిపించాయి. అద్దంకి దయాకర్ తో పాటు.. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, సంపత్ కుమార్, కుసుమ కుమార్, వేం నరేందర్ రెడ్డి, వీహెచ్ తో పాటు అనేక మంది లీడర్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. విజయశాంతి కూడా ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె పేరును ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఫైనల్ లిస్ట్ లో ఆమె పేరు రావడంతో అంతా షాక్ అయ్యారు. ఆమె పేరు హైకమాండ్ ఛాయిస్ అన్న చర్చ అప్పటి నుంచి మొదలైంది.
మరో రెండు వారాల్లో మంత్రివర్గ విస్తరణ..
అయితే విజయశాంతిని కేవలం ఎమ్మెల్సీకే పరిమితం చేసే అవకాశం లేదని.. ఆమెకు పదవి ఇవ్వడం వెనుక హైకమాండ్ భారీ వ్యూహాన్ని రచించిందని తెలుస్తోంది. గతంలో కేసీఆర్ తో కలిసి పని చేసిన రాములమ్మను.. బీఆర్ఎస్ పైకి అస్త్రంగా ప్రయోగించాలని హైకమాండ్ భావిస్తోందన్న చర్చ సాగుతోంది. ఉద్యమ నేపథ్యం విజయశాంతికి అదనపు బలం అని హైకమాండ్ లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. మరో రెండు వారాల్లో కేబినెట్ విస్తరణకు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే విజయశాంతితో పాటు కేబినెట్లో ఉన్న మొత్తం ఖాళీలను భర్తీ చేస్తారా? కేవలం ఆమెకు ఒక్కరికి మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుంటారా? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.