నెయ్యి.. భారతీయులు అత్యధికంగా ఇష్టపడే ఆహార పదార్థాల్లో ఒకటి. చాలా మంది నెయ్యిని ఇతర ఆహార పదార్థాలతో కలుపుకుని తింటూ ఉంటారు. ముఖ్యంగా పోషకాలు, బలం కోసమని చిన్నపిల్లలు తినే అన్ని ఆహార పదార్థాల్లో నెయ్యిని చేరుస్తారు. ఇంకా నెయ్యి శరీరానికి శక్తితో పాటు చర్మానికి సౌందర్యాన్ని కూడా అందిస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇందులో ఉండే ప్రత్యేకమైనా పోషకాలు జీర్ణవ్యవస్థను కూడా మెరుగు పరుస్తూ ఉంటుంది. అయితే.. నెయ్యిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఆహార పదార్థాల వివరాలు ఇలా ఉన్నాయి. నెయ్యితో కలిపి తీసుకోకూడని పదార్థాలివే.. తేనె: నెయ్యిని తేనెతో కలిపి అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేప: చేపలతో తయారు చేసిన వంటకంలోనూ నెయ్యిని అస్సలు కలపకూడదు. ఇలాంటి ఆహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ముల్లంగి: ముల్లంగిని సైతం నెయ్యితో కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ముల్లంగి త్వరగా జీర్ణం అవుతుంది. అయితే నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణక్రియలో ఆటంకాలు ఏర్పడి పొట్టలో వాపు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని హెచ్చరిస్తున్నారు. వేడి నీరు: వేడి నీరులోనూ నెయ్యిని కలిపి తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శరీరానికి హాని చేస్తుందని చెబుతున్నారు. వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే జీర్ణవ్యవస్థకు చికాకు కలిగించి శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుందని చెబుతున్నారు.