2024 టాలీవుడ్ కు బాగానే కలిసొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమ భారీ లాభాలనే అందుకుంది. ఈ సంవత్సరం హనుమాన్, కల్కి 2898AD, పుష్ప 2 వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాలు సాధించాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అన్ని భాషల్లోనూ మంచి స్పందన రాబట్టాయి. అయితే, అదే సంవత్సరంలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా నిలిచి నిర్మాతలకు భారీ నష్టాల్ని తెచ్చిపెట్టాయి. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 1.సైంధవ్ విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను కాంబోలో తెరకెక్కిన 'సైంధవ్'. మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండటం, స్క్రీన్ ప్లేతో పాటూ నేరేషన్ కూడా అర్థం కానీ రీతిలో ఉండటంతో సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దానికి ఈ సినిమాకి పోటీగా హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగా సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా 'సైంధవ్' కు మైనస్ అయింది. దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కేవలం రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే సాధించి, సుమారు రూ.20 కోట్ల నష్టాలను చవిచూసింది. Also Read: అశ్విన్ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! 2. ఫ్యామిలీ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గీత గోవిందం సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టి, ఆ ఏడాదిలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' మాత్రం అంచనాలను అందుకోలేక ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫస్ట్ వీక్ కలెక్షన్లు బాగానే వచ్చినా.. ఆ తర్వాత సినిమాపై నెగటివ్ టాక్ పెరిగిపోవడంతో పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాబట్టలేకపోయింది. ఈ సినిమా కోసం సుమారు రూ.50 కోట్ల బడ్జెట్ పెడితే.. రిలీజ్ తర్వాత ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా కేవలం రూ.23 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి.. నిర్మాతలకు దాదాపు రూ.30 కోట్ల నష్టాలు మిగిల్చింది. 3. మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది, కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడం, ఆ తర్వాత నెగటివ్ టాక్ పెరగడం సినిమాకు పెద్ద మైనస్ గా మారాయి. సినిమా నెమ్మదిగా సాగడం, రన్‌టైమ్ ఎక్కువగా ఉండటం, కథలో ఉత్సాహం లేకపోవడం, హీరోయిన్ గ్లామర్ డోస్ మితిమీరడం.. లాంటి కారణాలతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తే.. వరల్డ్‌వైడ్‌గా కేవలం రూ.14 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. దాంతో ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల నష్టాలను మూటగట్టుకుని, ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. Also Read: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే? 4. డబుల్ ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. రామ్‌ను పూర్తి మాస్ అవతారంలో చూపించి పూరి జగన్నాథ్ మంచి విజయాన్ని అందుకున్నారు. రామ్ కెరీర్‌లో 'ఇస్మార్ట్ శంకర్' ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కథలో కొత్తదనం లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం, విలన్ పాత్రలను సరిగ్గా తీర్చిదిద్దకపోవడం వంటి కారణాల వల్ల 'ఇస్మార్ట్ శంకర్' మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయలేకపోయింది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తన సొంత నిర్మాణ సంస్థలో దాదాపు 90 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ.20.53 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసి సుమారు 70 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 5. మట్కా బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తో సతమవుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ గా 'మట్కా' సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. విడుదలకి ముందు టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ ని బాగానే చేసింది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదటి ఆట నుంచే సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో సినిమా పూర్తిగా నిరాశపరిచింది. కథలో కొత్తదనం లేకపోవడం, పేలవమైన కథనం ప్రేక్షకులను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. దాదాపు 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం కేవలం 3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను మాత్రమే రాబట్టి ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలతో పాటూ యత్ర 2, ఈగల్, ఆపరేషన్ వాలెంటైన్, భీమా, విశ్వం.. ఇలా చాలానే ఉన్నాయి.