Hydra ; చెరువుల పరిరక్షణ, పునరుజ్జీవనానికి కృషి చేస్తున్న హైడ్రాకు తగిన న్యాయ సలహాలు అందించడానికి ఎళ్లప్పుడూ అందుబాటులో ఉంటామని న్యాయ నిపుణులు వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలతో పాటు రహదారులు, పార్కులు కబ్జా కాకుండా కాపాడుతున్న హైడ్రాను న్యాయ నిపుణులు అభినందించారు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడడంలో తలెత్తుతున్న ఇబ్బందులు, న్యాయపరమైన అంశాలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై శనివారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో పలువురు న్యాయ నిపుణులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసిన విశ్రాంత అధికారులు పాల్గొని విలువైన సూచనలు చేశారు. అనేక అంశాలపై సందేహాలను నివృత్తి చేశారు. చెరువులను పునరుద్ధరించడం.. వరద కాలువలను సజీవంగా ఉంచడంతోనే నగరానికి వరద ముప్పు తప్పుతుందని నిపుణులు సూచించారు. గొలుసుకట్టు చెరువులు లింకు తెగిపోవడంతో 2 సెంటీమీటర్లు దాటి వర్షం పడితే నగర రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని అభిప్రయాపడ్డారు. పటిష్టంగా అమలు చేయాలి.. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణకు సంబంధించి చట్టాలున్నప్పటికీ వాటిని అమలు పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని హైడ్రా తీసుకు వచ్చి.. భవిష్యత్ తరాలకు పర్యావరణంతో కూడిన మెరుగైన జీవనాన్ని అందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువు శిఖం భూముల విషయంలో ప్రైవేటు పట్టాలున్న వారు వ్యవసాయం మాత్రమే చేసుకోవాల్సి ఉంది. మరే ఇతర హక్కులు ఉండవని చెప్పారు. చెరువుల మధ్యనుంచి పలు చోట్ల రహదారులు నిర్మించారని.. అయితే ఇరువైపులా నీటికి అడ్డు లేకుండా పై వంతెనలు కడితే బాగుంటుందని సూచించారు. చెరువుల బఫర్ జోన్లలో మట్టితో నింపేసి.. వారి స్థలం ముంపు ప్రాతంలో లేదని చూపించే ప్రయత్నాలను ఎన్ఆర్ఎస్ ఏ, సర్వే ఆఫ్ ఇండియా, గ్రామీణ మ్యాప్‌ల ద్వారా నివారించవచ్చు అని అన్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనుమతి లేని లే ఔట్లలోని ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని వ్యవస్థ రావాలని సూచించారు. అలాగే మాస్టర్ ప్లాన్‌లో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు దుర్వినియోగం అయితే నేరుగా చర్యలు తీసుకోవచ్చునన్నారు. హెచ్ ఎం డీఏ పరిధిలోకి గ్రామాలు చేరినప్పడు గ్రామపంచాయతీ లే ఔట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: రుణమాఫీ 70శాతమే.. 100శాతం అని చెప్పడానికి సిగ్గుండాలి: కేటీఆర్ లే ఔట్లలో 30 శాతం భూమిని ప్రజావసరాలకోసం కేటాయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భూ వినియోగానికి సంబంధించిన సవరణలు ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయన్నారు. అనుమతి పొందిన లే ఔట్‌ను అతిక్రమించి నిర్మాణాలు చేపడితే చట్టం ప్రకారం కూల్చివేయవచ్చని వర్క్‌షాప్ నొక్కి చెప్పింది. హైకోర్టు సీనియర్ న్యాయవాది రేసు మహేందర్ రెడ్డి, జీహెచ్ ఎంసీ, హైడ్రా హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ కె. రవీందర్‌రెడ్డి, జీహెచ్ ఎంసీ, హైడ్రా హైకోర్టు అసిస్టెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సీహెచ్. జయకృష్ణ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, న్యాయ, రెవెన్యూ రంగ నిపుణుడు ఎన్. శ్రీనివాస్ రావు, సీసీఎల్ ఏ రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. మధుసూధన్, మాజీ సీనియర్ అడ్వకేట్ మరియు ప్రొఫెసర్ డా.పి. రాజ్ గోపాల్ తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు, వివిధ శాఖలకు చెందిన నిపుణులు ఈ సదస్సలో పాల్గొన్నారు.