గేటెడ్ కమ్యూనిటీల మాదిరి కాలనీల చుట్టూ రహదారులను నిర్మించిన పక్షంలో వాటిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. మొత్తం ఫిర్యాదుల్లో అధికభాగం పార్కులు, రహదారుల కబ్జాలే ఉన్నాయని.. లే ఔట్ ప్రకారం రహదారులుండేలా చూడాలని సూచించారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై అక్కడికక్కడే హైడ్రా అధికారులతో చర్చించి చర్యలకు హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించి.. దశాబ్దం క్రితం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకున్నారు. ఫిర్యాదు దారులకు కూడా చూపించి.. సమస్య పరిష్కారానికి చర్యలు సూచించారు. ఫిర్యాదుదారులు సంప్రదించాల్సిన హైడ్రా అధికారులను పరిచయం చేసి.. వారు విచారణకు వచ్చిన సమయంలో అన్ని వివరాలు అందజేయాలని సూచించారు.
ఒకప్పడు సెప్టిక్ ట్యాంకుల కోసం కేటాయించిన స్థలాలను.. ఇప్పుడు వినియోగంలో లేవని.. వాటిని ప్రజావసరాలకు కేటాయించిన స్థలంగానే పరిగణించాలని అన్నారు. ఎవరైనా కబ్జాలు చేస్తే వెంటనే వాటిని తొలగించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. కాప్ర మున్సిపాలిటీలో వంపుగూడ పక్కన ఉన్న ఎన్ ఆర్ ఐ కాలనీవాళ్లు ప్రహరీ నిర్మించారు. అలాగే చందానగర్ సర్కిల్ 21లోని మాతృశ్రీనగర్‌లోని పార్కులో కొంత భాగాన్ని, పార్కులో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను కబ్జా చేశారంటూ ఫిర్యాదులు వచ్చాయి.
వీటితో పాటు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం, కోహెడ గ్రామంలో సమ్మిరెడ్డి బాల్ రెడ్డి తమ ప్లాట్లను కబ్జా చేశారంటూ పలువురు ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 951 నుంచి 954 లలో 1986లో గ్రామపంచాయతీ లే ఔట్‌లో తాము ప్లాట్లు కొంటే వాటిని చూడలేని పరిస్థితి ఉందన్నారు. తమ ప్లాట్లను కొన్నింటిని కాజేసి ఫామ్ హౌస్ మాదిరి చుట్టూ ప్రహరీ నిర్మించుకుని ఎవరినీ అనుమతించడంలేదని హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట
తమ ప్లాట్లను తీసుకున్నారు
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం, కొర్రెముల్ గ్రామ పంచాయతీలో తమ ప్లాట్లను నల్ల మల్లారెడ్డి కబ్జా చేశారని.. సర్వే నంబరు 716 నుంచి 718లో గ్రామపంచాయతీ లేఔట్‌లో తనతో పాటు 23 మంది 1987లో కొన్న ప్లాట్లను నల్లమల్లారెడ్డి కాజేశారని ఖాజా మీరన్ మొయినుద్దీన్ ఫిర్యాదు చేశారు. 2010లో రెవెన్యూ , రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన రికార్డులను ట్యాంపెరింగ్ చేసి తన కబ్జాలో పెట్టుకున్నారన్నారు. నల్లమల్లారెడ్డిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా 2013లో పెట్టామని తెలిపారు. మొత్తం 23 కేసుల వివరాలతో ఆంధ్రప్రదేశ్ గజెట్ కూడా ప్రచురితమైందన్నారు.
విద్యాసంస్థల అధినేత నల్లమల్లా రెడ్డి తమ ప్రైవేట్ ప్లాట్లను మాత్రమే కాకుండా, ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి, తన రాజకీయ శక్తిని ఉపయోగించి వాటిని అనుభవిస్తున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో HYDRAA జోక్యం చేసుకోవడం అత్యంత అవసరమన్నారు. HYDRAA దీనిపై దర్యాప్తు చేపట్టినట్లయితే, తమ ప్రైవేట్ ప్లాట్లతో పాటు ప్రభుత్వ భూమిని కూడా రక్షించగలదని ఖాజా మీరన్ మొయినుద్దీన్ పేర్కొన్నారు.
Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
గొలుసుకట్టు చెరువును కాపాడండి
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం మల్కాజిగిరి మున్సిపాలిటీలోని యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువును ఫంక్షన్ హాల్ యజమానులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని.. గతంలో రెండు సార్లు స్థానిక ఎంఆర్‌వో కూల్చివేయగా.. ఇటీవల హైడ్రా కూడా కూల్చిందని యాప్రాల్ కులసంఘాల జేఏసీ ఛైర్మెన్ ఆర్. చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. ఈ చెరువు నాలాను పూర్తిగా ఆక్రమించిన ఫంక్షన్ హాల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జాలను తొలగించి చెరువును కాపాడాలని.. అనుమతి లేని ఫంక్షన్ హాల్‌ను తొలగించాలని అని అందులో పేర్కొన్నాడు.
ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని ఇప్పించండి
ప్రభుత్వం తనకు కూకట్‌పల్లి - నిజాంపేట రోడ్డులోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక 300ల గజాల స్థలాన్ని కేటయించిందని రిటైర్డ్ సైనిక ఉద్యోగి పి. సీతారామరాజు అన్నారు. అయితే తనకు ఇచ్చిన 300ల గజాలతో పాటు.. మొత్తం 1253 గజాల స్థలాన్ని స్థానిక మహిళ కబ్జాచేసిందని ఆయన ఆరోపించారు. ఇదంతా ప్రభుత్వ స్థలమని.. కోర్టు ఉత్తర్వులతో పాటు.. ప్రభుత్వ ఆదేశాలున్నా తనకు 300ల గజాల స్థలం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జాదారు నుంచి కాపాడి.. తనకు ప్రభుత్వం కేటాయించిన 300ల గజాల స్థలం వచ్చేలా హైడ్రాచూడాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.