గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విడదలయ్యారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని గురువారం గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తాజాగా హరీశ్ రావు స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read: చట్టాలంటే ప్రజలకు భయం, గౌరవం లేదు.. రోడ్డు ప్రమాదాలపై నితిన్ గడ్కరీ '' కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తోంది. ఎఫ్‌ఐఆర్‌లు పోలీస్ స్టేషన్ నుంచి కాదు.. గాంధీ భవన్ నుంచి వస్తున్నాయి. కాంగ్రెస్ పగ, ప్రతీకారాలతో పనిచేస్తోంది. పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు. ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం. కేసీఆర్ కట్టిన నిర్మాణాలను మీరు ప్రారంభిస్తున్నారు. ఏడాది పాలనలో ఒక్క పాలసీ అయినా చేశారా ?. రేవంత్ సీఎంగా పనిచేయట్లేదు. గల్లినాయకుడిగా పనిచేస్తున్నారు. రేవంత్ తెచ్చిన మార్పు అంటే ఇదేనా ?. చట్టాలు, రాజ్యాంగం శాశ్వతం.. సీఎం శాశ్వతం కాదు. ఏడాది పాలనలో మహిళలకు లక్ష కోట్ల రుణమన్నారు. అదంతా బోగస్. వరంగల్ డిక్లరేషన్ 9 హామీల్లో ఒకటి కూడా అమలు కాలేదు. మేం వాటినే అమలు చేయమని సలహా ఇచ్చాం కదా. మూడుసార్లు రైతుబంధు ఇవ్వమని అడిగాం కదా. అవ్వా తాతలకు 4 వేల పింఛన్ ఎపుడిస్తారని అడిగాం కదా. 7 నెలల నుంచి పోలీసులకు టీఏలు ఇవ్వడం లేదు. రైతులకు మద్దతు ధర లేదు, బోనస్ బోగస్ అయ్యింది. రైతు రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టారు. రైతుబంధు ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలను, మహిళలను అరెస్టు చేశారు. వీళ్లందరినీ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా విడుల చేయాలి. కౌశిక్ రెడ్డిని విడుదల చేసే వరకూ బీఆర్ఎస్ నిద్రపోదు, ఆయనకు అండగా ఉంటుందని'' హరీశ్ రావు అన్నారు. Also Read: తెలంగాణలో 40 వేల కోట్ల విలువైన భూకబ్జా.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు ఇదిలాఉండగా.. సీఐని బెదిరించిన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో హరీశ్ రావు ఆయన ఇంటికి వెళ్లగా.. అదే సమయంలో పోలీసులు హరీశ్‌రావును అదుపులో గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదని.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అంటూ మండిపడ్డారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని.. వాళ్లని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే తాజాగా హరీశ్ రావు స్టేషన్ విడుదల కావడంతో రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.