ఏసీపీ విష్ణు మూర్తిపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. అల్లు అర్జున్‌ను తిడుతూ ఏసీపీ విష్ణుమూర్తి రీసెంట్‌గా ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించడంపై పోలీస్ శాఖ ఫైర్ అయింది. విష్ణుమూర్తిపై చర్యలు తీసుకోండి ఈ మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షంశ్ యాదవ్.. డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు. విష్ణుమూర్తిపై చర్యలు తీసుకోవాలని డీసీపీ నివేదికలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీసీపీ అక్షంశ్ యాదవ్ అన్నారు. కాగా ప్రస్తుతం ఏసీపీగా ఉన్న విష్ణుమూర్తి గతంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా పనిచేశారు. అంతేకాకుండా గతంలో డీజీపీ ఆఫీస్‌కు విష్ణుమూర్తిని అటాచ్ చేశారు. ఇక 2024లో విష్ణుమూర్తిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్‌మీట్ బాధ్యత రహితంగా వ్యవహరించిన అల్లు అర్జున్ పోలీసులనే అవమాపరిచేలా మాట్లాడుతున్నాడంటూ ఏసీపీ విష్ణుమూర్తి ఫైర్ అయ్యారు. ఓ ముద్దాయి అయిన నటుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అతను బాధ్యతగల పౌరుడు కాదని, చెప్పిన వినలేదని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. అందులో ఏసీపీ మాట్లాడుతూ.. ""డబ్బు మదంతో బడా బాబులు మాట్లాడుతున్నారు. ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి తన తప్పేం లేదని చెబుతున్నాడు. పోలీసులనే బద్నాం చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్నాడు. తన పని రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉందో లేదో ముందు తెలుసుకోవాలి. పాలు తాగే పిల్లవాడేం కాదు. పరిధిని దాటి మాట్లాడకూడదు. పరిధి దాటి ప్రవర్తిస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. అర్జెంట్ ఉంది కాబట్టి బందోబస్తు కావాలంటే సాధ్యం కాదే. ప్రొసీజర్ ప్రకారమే వెళ్లాలని చెప్పినం. కాగితం ఇచ్చి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి వెళ్లిపోతే అయిపోతుందా. మాకు రూల్స్ ఉండవా? పోలీసులను బూతులు తిడుతున్నారు. రాజకీయ నేతలు చాలా నోరు జారుతున్నారు. పది నిమిషాలు వదిలేసి పోతే మీ బతుకులు ఆగమైతాయి. ఈ విషయం గుర్తుంచుకోవాలి. అంతేగానీ అధికారం మదంతో మాట్లాడొద్దు. మేము మనుషులమే. మాకు ఆకలి, దప్పిక, ఫ్యామిలీ ఉంటుంది. అవన్నీ గమనించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి అవమనపరిస్తే మర్యాద ఉండదు. ఇలాగే నడుచుకుంటే రెస్పెక్ట్ కోల్పోతారు. ఇది కూడా చదవండి: రాహుల్‌గాంధీకి బిగ్ షాక్.. యూపీ కోర్టు సమన్లు ఇటీవల ఒకాయన ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆయన రిమాండ్ ఖైది ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరిచ్చారో ఆయనే చెప్పాలి. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నాడు. ట్రస్ట్ పెడుతామని చెబుతున్నారు. బైయిల్ క్యాన్సిల్ చేపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలను గందరగోళం చేయడం, పోలీసులపై రాళ్లు విసరడం సరైనది కాదు. పోలీసులు సంప్రదించలేదు. చేతులు ఊపమని చెప్పారని అన్నారు. కానీ వీడియోలో పక్కా ఆధారాలున్నాయి"" అని చెప్పారు. ఇక అతనికి సక్సెస్ మీట్ చేసుకోలేదనే బాధ తప్ప.. పశ్చాత్తాపం కనిపించట్లేదన్నారు. ఇక పోలీసు ఆఫీసర్లనే బట్టలిప్పి చూపించే సినిమాలు తీస్తారా అంటూ మండిపడ్డారు. ""హీరోయిజం మీ ఇంట్లోనే చూపించుకో. బయటకు వచ్చి ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం"" అన్నారు. ప్రైవేట్ సైన్యం చూసుకుని ఓవర్ చేస్తే అందరినీ లోపలేస్తామని హెచ్చరించారు. బాధితులకు డబ్బులిస్తే ముస్టి వేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు. పోయిన ప్రాణం తీసుకొస్తావా అంటూ తీవ్రంగా విమర్శించారు. బీ కేర్ ఫుల్. చట్టాన్ని ఉల్లంఘించాలని ట్రై చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారా? దేశ భక్తి సినిమాల తీస్తున్నారా? లంగతనం, దొంగతనం, మహిళలను పైసలిచ్చి లొంగదీసుకోవాలని మెసేజ్ ఇవ్వడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు.