/rtv/media/media_files/2026/03/15/stalin-2026-03-15-21-33-31.jpg)
Stalin
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం ఈసారి కూడా అధికారంలోకి వస్తుందా? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. స్టాలిన్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, ప్రజలపై రుణభారం పెరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో డీఎంకే పార్టీ ద్రవిడ నినాదం, సంక్షేమ పథకాలను నమ్ముకుని ఎన్నికల్లోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
డీఎంకేపై తీవ్ర విమర్శలు
డీఎంకే మంత్రుల అవినీతిపై, ఇసుక అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, కుటుంబ రాజకీయ అంశాలపై అధికార పార్టీకి విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేదని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. శాంతి భద్రతలు క్షీణించిపోయాయని అన్నాడీఎంకే కూడా నిలదీస్తోంది. రాష్ట్రానికి పెరుగుతున్న అప్పుల వల్ల పుట్టే ప్రతి బిడ్డకు రూ.1.5 లక్షల రుణభారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీవీకే అధినేత విజయ్ కూడా డీఎంకేపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.
Also Read: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. మమతా బెనర్జీకి షాక్ తప్పదా ?
మరోవైపు రాష్ట్రంలో మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార, విపక్ష పార్టీలు సంచలన హామీలు ప్రకటిస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రతినెల ఆర్థిక సాయం అందిస్తామని చెబుతున్నాయి. టీవీకే పార్టీ.. ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప మిగతా మహిళలందరికీ నెలకు రూ.2500 అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఏడాదికి మూడు LPG సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని అన్నాడీఎంకే అంటోంది. అలాగే ఆర్థిక సాయం కింద రూ.10 వేలు ఇస్తామని చెబుతోంది. రాష్ట్రంలో 1.31 కోట్ల మహిళలకు రూ.5 వేల చొప్పున ఇస్తామని ప్రకటించామని.. కానీ విపక్షాలు దీన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయని సీఎం స్టాలిన్ ఆరోపణలు చేస్తున్నారు.
కాంగ్రెస్‌తో పొత్తు ?
మరోసారి అధికారంలోకి వచ్చేందుకు డీఎంకే అనేక ప్రయత్నాలు చేస్తోంది. మాజీ సీఎం ఒ.పన్నీర్ సెల్వంను పార్టీలో చేర్చుకున్న సంగతి తెలసిందే. అలాగే కాంగ్రెస్‌తో పొత్తు అంశంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌తో పాటు వామపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకే సపోర్ట్ చేస్తున్నాయి. అయితే డీఎంకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేదానిపై మరికొన్నిరోజుల్లోనే క్లారిటీ రానుంది.
Also Read: ప్రపంచ దేశాలకు బిగ్ షాక్.. మరో జలసంధి మూసివేతకు హౌతీల బిగ్ ప్లాన్
డీఎంకేపై విపక్షాలు ముఖ్యంగా కుటుంబ పాలన అంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. స్టాలిన్ కొడుకు గతంలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో స్కామ్ లాంటివి అధికార ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతున్నాయి. విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చి డీఎంకేపై విమర్శలు చేస్తుండటం కూడా పార్టీ ఓట్లు చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నీట్ రద్దు చేస్తామని, పెట్రోల్‌పై సబ్సిడీ ఇస్తామని చెప్పి హామీలు నెరవేర్చలేకపోయిందనే విమర్శలు డీఎంకేపై ఉన్నాయి. మరి ఈసారి డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందా ? లేదా అనేది తెలియాలంటే మే 4 వరకు వేచిచూడాల్సిందే.
Follow Us