Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం..మత మార్పిడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్ష!

మహారాష్ట్ర అసెంబ్లీ సోమవారం రాత్రి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులను అరికట్టే లక్ష్యంతో తీసుకువచ్చిన మహారాష్ట్ర మత స్వేచ్ఛ బిల్లు 2026ను సభ ఆమోదించింది.

New Update
maharashtra

మహారాష్ట్ర అసెంబ్లీ సోమవారం రాత్రి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులను అరికట్టే లక్ష్యంతో తీసుకువచ్చిన మహారాష్ట్ర మత స్వేచ్ఛ బిల్లు 2026ను సభ ఆమోదించింది. మోసం, ప్రలోభాలు, బెదిరింపులు లేదా కేవలం పెళ్లి కోసమే చేసే మత మార్పిడులపై ఈ చట్టం ఉక్కుపాదం మోపనుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ బిల్లును ప్రవేశపెడుతూ, ఇది ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదని, కేవలం అక్రమ మార్గాల్లో జరిగే మార్పిడులను అడ్డుకోవడమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు.

మత మార్పిడికి పాల్పడితే

ఈ కొత్త చట్టం ప్రకారం శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. పెళ్లి పేరుతో మోసపూరితంగా మత మార్పిడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.  లక్ష జరిమానా విధిస్తారు. ఒకవేళ బాధితులు మైనర్లు, మహిళలు లేదా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారైతే, శిక్షా కాలం 7 ఏళ్లుగా ఉంటూనే జరిమానా రూ. 5 లక్షల వరకు ఉంటుంది. ఇక సామూహిక మత మార్పిడులకు పాల్పడే వారికి కూడా ఇదే తరహా శిక్షలు వర్తిస్తాయి. పదేపదే ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు ఉందని, అయితే ఇతరులను ప్రలోభపెట్టి మార్చడం ఆ హక్కు కిందకు రాదని ఫడ్నవీస్ గుర్తుచేశారు. ఇప్పటికే ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. చాలా మంది మహిళలు ప్రేమ, పెళ్లి పేరుతో మోసపోయి, ఆ తర్వాత వదిలివేయబడుతున్నారని, వారిని రక్షించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ బిల్లుకు ప్రతిపక్ష శివసేన (యుబిటి) కూడా మద్దతు తెలపడం విశేషం.

అయితే, ఈ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ కూడా జరిగింది. ఎవరైనా మతం మారాలనుకుంటే 60 రోజుల ముందే జిల్లా మేజిస్ట్రేట్‌కు నోటీసు ఇవ్వాలనే నిబంధనపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. ఆ వ్యక్తి తన స్వచ్ఛంద నిర్ణయం ప్రకారమే మారుతున్నారా లేదా ఎవరైనా బలవంతం చేస్తున్నారా అని నిర్ధారించుకోవడానికే ఈ నిబంధన అని వివరించింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు మాత్రం ఇది వ్యక్తిగత గోప్యతకు, రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా, మెజారిటీ సభ్యుల మద్దతుతో ఈ బిల్లు మహారాష్ట్ర అసెంబ్లీలో నెగ్గింది.

Advertisment
తాజా కథనాలు