కర్ణాటకలోని బెళగావ్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ జనగణనతో పాటు కులగణన కూడా చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పిన ప్రతిపాదనకు పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. '' దేశంలో త్వరలో పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశాలున్నాయి. జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలలో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉంది. అందువల్ల ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలి. నియోజకవర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. Also Read: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత .. చట్ట సభల్లో మహిళ బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశ పెట్టి ఓ కొలిక్కి తెచ్చిన నేపథ్యంలో ఆ బిల్లుపై మనం ఎక్కవగా ప్రచారం చేయాలి. బీజేపీ మహిళ బిల్లుతో వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కులగణన తెలంగాణలో, దేశంలో మార్గదర్శిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జనగణనలో దేశ వ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలని'' రేవంత్ అన్నారు. దీనిపై ఓ తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలని రేవంత్ సూచించగా.. ఈ ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ''సరిగ్గా వందేళ్ల క్రితం ఇదే బెళగావ్‌లో మహాత్మా గాంధీని సీడబ్ల్యూసీ ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నుకుంది. కులగణనతో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయనే రాహుల్ గాంధీ ఆలోచనలను దేశమంతటా స్వాగతించాల్సిన అంశం. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించి పాలిస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీకి కులగణన చెంపపెట్టు లాంటిది. ఇప్పటికే తెలంగాణలో 90 శాతం కులగణన పూర్తయిందని'' మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.