తమిళనాడులోని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ జరగడం దుమారం రేపుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. ఈ ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే పార్టీ అధికారం కోల్పోయేవరకు తాను పాదరక్షలు వేసుకోనని ప్రతీజ్ఞ చేశారు. గురువారం కోయంబత్తూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన స్టాలిన్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. '' DMK ప్రభుత్వాన్ని అధికారం కోల్పోయేవరకు నేను పాదరక్షలు వేసుకోను. అవి లేకుండానే నడుస్తాను. ఎన్నికల్లో గెలవడానికి డబ్బులను ఎరగా చూపించం. రూపాయి పంచకుండా ఎన్నికల బరిలోకి దిగుతాం. వచ్చే ఎన్నికల్లో గెలిచేవరకు చెప్పు ధరించనని'' అన్నామలై ప్రతీజ్ఞ చేశారు. అలాగే తమిళనాడులో చెడు అంతం కావాలని కోరుకుంటూ తన ఇంట్లో ఆరు కొరడా దెబ్బలు భరించి మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. అలాగా రాష్ట్రంలో ఉన్న ఆరు మురుగన్ క్షేత్రాలను దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేడతానని చెప్పారు. Also Read: ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు అయితే అన్నా వర్సిటీకి చెందిన బాధితురాలి ఫిర్యాదుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ను లీక్ చేయడంపై కూడా అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి గోప్యతకు భంగం కలిగిలే పోలీసులు వ్యవహరించారంటూ ధ్వజమెత్తారు. లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో నిందితుడు జ్ఞానశేఖరన్‌పై రౌడీషీట్ తెరవలేదని ఆరోపించారు. డీఎంకే పార్టీతో అతనికి సంబంధం ఉండటమే కారణమని విమర్శించారు. ప్లాన్ ప్రకారం కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదిలాఉండగా పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 23న అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి రాత్రి యూనివర్సిటీ ప్రాంగణంలో తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు.. ఆ అమ్మాయి స్నేహితుడిని గాయపరిచి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఆ యువతిని అసభ్యకరంగా ఫొటోలు తీసి .. తమపై ఫిర్యాదు చేస్తే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. Also Read: సంభాల్‌లో మరో అద్భుతం.. తాజాగా బయటపడ్డ మృత్యుబావి అయినప్పటికీ బాధితురాలు ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూనివర్సిటీ ప్రాంగణంలోని సీసీ కెమెరాల సహాయంతో నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతడిని చెన్నై కోట్టూరుపురానికి చెందిన జ్ఞానశేఖరన్ గా గుర్తించారు. జ్ఞానశేఖరన్ రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకునేవాడని సమాచారం. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.