CM Revanth: సంధ్య థియేటర్ ఘటనతో టాలీవుడ్ కు పెద్ద దెబ్బె పడింది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వమని సంచలన ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు తలలు పట్టు కుంటుంటే సినిమా ఎగ్జిబీటర్లు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సోమవారం ఎగ్జిబిటర్స్ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు స్వాగతించారు. ఈ నిర్ణయం సింగిల్ స్క్రీన్స్ కు ఊపిరిపోసిందనే చెప్పాలి. అసలు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచితే ఎగ్జిబిటర్లకు కలిగే నష్టం ఏంటి? దీనివల్ల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లాభ పడుతున్నారు తప్పితే ఎగ్జిబీటర్లు మాత్రం నష్టపోతున్నారు. వివరంగా చెప్పాలంటే.. ఒక సినిమా నిర్మాణం జరిగి దాన్ని థియేటర్లో ఆడియన్స్ చూసే వరకు అందులో కీలక పాత్ర పోషించేది నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబీటర్.. నిర్మాత అనేవాడు సినిమాను కొంత బడ్జెట్ పెట్టి నిర్మించి.. దాన్ని డిస్ట్రిబ్యూటర్ కు అమ్ముతాడు. ఈ డిస్ట్రిబ్యూటర్ ఏరియాల వారీగా సినిమాను ఎగ్జిబిటర్లలకు అమ్ముతాడు. ఎగ్జిబిటర్లు అంటే ఒకవిధంగా థియేటర్ ఓనర్లే. డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబిటర్లు ఓ అమౌంట్ కు సినిమా రైట్స్ ను కొని థియేటర్స్ లో ప్రదర్శిస్తారు. జనాలు రాకుంటే నష్టమే.. ఈ ప్రాసెస్ లో సినిమా ఏమైనా తేడా కొడితే నష్టపోయేది ఎగ్జిబిటర్లు. అయితే ఈ మధ్య నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసాం అని అధిక రేట్లు పెడుతున్నారు. ఆ రేట్ల వల్ల థియేటర్స్ జనాలు రావడం లేదు. అలాంటప్పుడు కలెక్షన్స్ ఎలా వస్తాయి. అప్పుడు నష్టపోయేది ఎగ్జిబిటర్లే కదా! నిర్మాత ముందే సినిమాను ప్రాఫిట్ కు అమ్ముకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా ఏరియాల వారిగా సినిమా రైట్స్ అమ్మి తన ఫ్రాఫిట్ తాను చూసుకుంటాడు. కానీ చివర్లో ఆ సినిమా ఆడకపోయినా, టికెట్ రేట్లు పెంచడం వల్ల జనాలు రాకపోయినా ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోతారు. ఉదాహరణకు రూ.1000 టికెట్ ధర అని చెప్పడంతో ప్రేక్షకుడు ముందుగానే సినిమాకు వెళ్లే యోచన చేయడం లేదు. రేటు తక్కువ ఉంటే, ప్రేక్షకులు బాగా వస్తారు. అప్పుడు ఒక సినిమా ఎక్కువ రోజులు థియేటర్స్ లో ఆడుతుంది. దాని వల్ల ఎగ్జిబిటర్లకు డబ్బులు కూడా బాగా వస్తాయి. బెనిఫిట్ షో వల్ల వాళ్ళకే లాభం.. ఇక ఈ మధ్య బెనిఫిట్ షో.. ఆ షో టికెట్స్ కు ఇష్టమొచ్చిన రేట్లు పెడుతున్నారు. 'పుష్ప2' విషయంలో చూసుకుంటే రూ.800, రూ.1000 బెనిఫిట్ షో టికెట్ ధరగా నిర్ణయించారు. పెద్ద హీరో సినిమా కాబట్టి ఫ్యాన్స్ రేటు ఎంతైనా బెనిఫిట్ షోకి వస్తారు. దాన్నే నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు. దీని వల్ల లాభం వచ్చేది నిర్మాతలకే కానీ ఎగ్జిబిటర్లకు కాదు. బెనిఫిట్ షో కోసం కొన్ని థియేటర్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. థియేటర్ వాళ్ళతోనే డీల్ మాట్లాడుకుంటున్నారు. సో ఇందులో ఎగ్జిబిటర్ల ప్రమేయం ఉండదు. దానికి తోడు బెనిఫిట్ షోలు ఎక్కువగా సింగిల్ స్క్రేన్స్ లోనే ఉంటాయి. మధ్యతరగతి వాళ్లు ఎక్కువగా సింగిల్ స్క్రీన్‌లకు వస్తారు. ఇక్కడ టికెట్ ధర రూ.500 పెడితే ఎవరూ రావటం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వీటన్నింటికి చెక్ పెట్టడంతో ఎగ్జిబిటర్లు ఆయన నిర్ణయంతో సంతోషంగా ఉన్నారు.