Singareni: సింగరేణిలో మరో కార్మిక సంఘం...ఆయన వెనుక ఎవరున్నారు?

తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి బొగ్గుగనుల్లో మరో కార్మిక సంఘం పురుడుపోసుకోనుంది. ఇప్పటివరకు ఉన్న కార్మిక సంఘాలకు బిన్నంగా కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కొత్త కార్మిక సంఘం పనిచేయనున్నట్లు చెబుతున్నారు.

New Update
singareni

singareni coal mines

Singareni: తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి బొగ్గుగనుల్లో మరో కార్మిక సంఘం పురుడుపోసుకోనుంది. ఇప్పటివరకు ఉన్న కార్మిక సంఘాలకు బిన్నంగా కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కొత్త కార్మిక సంఘం పనిచేయనున్నట్లు చెబుతున్నారు. యూనియన్‌ విధివిధానాలు, పోరాట మార్గాలు, నాయకత్వం తదితర అంశాలపై ఇప్పటికే జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. నిజానికి సింగరేణిలో ఐదు జాతీయ సంఘాలతో పాటు అనేక ప్రాంతీయ కార్మికసంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ కార్మికసంఘం గుర్తింపు కార్మికసంఘంగా ఉంది. 

ప్రస్తుతం సింగరేణిలో ఏఐటీయుసీ, ఐఎన్‌టీయుసీ, హెచ్‌ఎంఎస్‌,బీఎంఎస్‌, సీఐటీయులు జాతీయ కార్మికసంఘాలుగా ఉన్నాయి. వీటితో పాటు టీజీబీకేఎస్‌, జీఎల్‌బీకేఎస్‌( ఐఎఫ్‌టీయు), టీఎన్‌టీయుసీ వంటి స్థానిక సంఘాలు,ఇతర క్రాఫ్ట్‌ సంఘాలు ఎన్నో ఉన్నాయి. అయితే గుర్తింపు సంఘంతో పాటు ఇతర కార్మిక సంఘాలు కార్మికుల హక్కుల విషయంలో అంతగా స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేకుండా స్వాతంత్ర్య కార్మిక సంఘంగా ఉండాలనే లక్ష్యంతో యూనియ‌న్ ఏర్పాటుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

 సింగ‌రేణిలో ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొత్త కార్మిక సంఘం ఏర్పాటుకు ఇదే స‌రైన స‌మ‌య‌ని భావిస్తున్న కొంద‌రు నేత‌లు ఆ వైపుగా ప్రయ‌త్నాలు చేస్తున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (TBGKS) ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించిన కెంగ‌ర్ల మ‌ల్లయ్య కొత్త కార్మిక సంఘం ఏర్పాటుకు క‌స‌ర‌త్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా ఆయ‌న ఇప్పటికే ప‌లువురు నేత‌ల‌తో చర్చలు సాగించినట్లు తెలుస్తుంది. టీబీజీకేఎస్‌ ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్రం పోషించడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలోనూ కెంగర్ల మల్లయ్య ప్రధాన భూమిక పోషించారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా విజయం సాధించడానికి ఆయన విశేష కృషి చేశారు. అయితే ఆ తర్వాత నాయకుల మధ్య వచ్చిన విభేదాల నేపథ్యంలో కొంతకాలం ఆయన యూనియన్‌కు దూరంగా ఉన్నారు. అనంతరం తిరిగి క్రీయశీలంగా పనిచేస్తున్నప్పటికీ ఆయనకు యూనియన్‌లో ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో ఆయన కొంత కాలంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఆయన యూనియన్ పెట్టడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వివిధ కార్మిక సంఘాల్లో త‌నకు అనుకూలంగా ఉన్న వారితో ఆయన చర్చలు జరుపుతున్నారు. కార్మిక సంఘం విధివిధానాలు, ప్రణాళిక‌లు, కార్మిక సంఘం పేరు, జెండా ఇలా అన్ని అంశాలపై చర్చలు  సాగిస్తున్నారు. అయితే, ఆ కార్మిక సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు..? అనే దానిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది..

 కాగా ప్రస్తుతం సింగరేణి సంస్థలో కార్మిక హక్కుల పరిరక్షణ అనేది లేకుండా పోయింది. వారి హక్కులు హరించుకుపోతున్నా పట్టించుకున్నవారే లేరు. చివ‌ర‌కు మెడిక‌ల్ బోర్డు విష‌యంలో అటు ప్రభుత్వం, ఇటు యాజ‌మాన్యం ప‌ట్టించుకోకున్నా కార్మిక సంఘాలు మౌనం వ‌హిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు సింగరేణిలో కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి పనిభారం పెరుగుతున్నా కార్మిక పంఘాలు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. వారసత్వ ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. మారుపేర్ల సమస్య, కొత్త గనుల ఏర్పాటు ఇలా అనేక సమస్యలున్నాయి.ఇన్ని సమస్యల మధ్య నూతన కార్మిక సంఘం ఏర్పాటు ఒక సవాలే అని చెప్పాలి.ఈ నేప‌థ్యంలోనే కొత్త కార్మిక సంఘం ఏర్పాటైతే కార్మికులు ఆద‌రిస్తార‌ని కెంగ‌ర్ల మ‌ల్లయ్య భావిస్తున్నారు. అయితే ఆయన కార్మికసంఘం ఏర్పాటు వెనుక ఏదైనా రాజకీయ శక్తి ఉందా? లేదంటే ఆయనే స్వతంత్రంగా సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారనేది క్లారిటీ రావలసి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త కార్మిక సంఘాన్ని కార్మికులు ఏ మేరకు ఆదరిస్తారు. కార్మికులు ఆయనను ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది ముందు ముందు తెలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు