Hyderabad: అది 2024 డిసెంబర్ 4. ఇద్దరు పసి పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఫ్యామిలీలో ఒక్కసారిగా ఊహించని విషాదం నెలకొంది. అభిమాన హీరో చిత్రం ఫస్ట్ షో చూడాలనుకున్న వారి కల కన్నీటిధారలైంది. ఇసుకేస్తే రాలనంతా జనసంద్రంలోనూ ఫేవరేట్ హీరోను చూడాలని ఆరాటపడిన ఆ ఇంటి దీపం ఆరిపోయింది. అభిమానం అనే మత్తులో మానవత్వాన్ని మరిచిన ఓ సమూహం.. తల్లీ, బిడ్డను తమకాళ్లకింద నలిపేసింది. పాదాలకింద కన్నబిడ్డ దేహం చితికిపోతుంటే తల్లిడిల్లిపోయిన మాతృమూర్తి బిడ్డను కాపాడే ప్రయత్నంలో తనువు చాలించింది. పోలీసుల కళ్లముందే ఆ తల్లి అక్కడికక్కడే ఊపిరి విడవగా.. పసిబాలుడి ప్రాణం ఇంకా కొట్టుమిట్టాడుతోంది. ఇక తన తల్లి తమను వదిలేసి ఊరెళ్లిందని, ఇక ఎప్పటికీ రాదని ముక్కుపచ్చలారని కూతురు అమాయకంగా చెబుతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. నా అన్నా వస్తాడు.. రాగానే ఇద్దరం కలిసి ఆడుకుంటామంటున్న ఈ చిన్నారి మాటలు వింటుంటే దు:ఖం తన్నుకొస్తుంది. అటు భార్యను పోగొట్టుకుని, ఇటు కొడుకు బతికొస్తాడో లేదో తెలియక.. ఇదంతా పసికూతురుకు ఎలా చెప్పాలో దిక్కుతోచక తనలో తానే కుమిలిపోతున్న ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఓదార్చేదెవరు? ముక్కుపచ్చలారని పిల్లలకు తల్లిలేని లోటు తీర్చేవారెవరు? శ్రీతేజ్, రేవతి ఫ్యామిలీ అమ్మ రాదు! అన్న రాగానే ఆడుకుంటాం.. శాన్వితా! తెలుగు నటుడు అల్లు అర్జున్ నటించిన "పుష్ప2" సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర చోటుచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సినిమాకోసం వెళ్లిన కుటుంబం చిన్నాభిన్నమవగా ఇంటిదగ్గర అమ్మ, అన్నకోసం ఎదురుచూస్తున్న శాన్వితా మాటలు వింటే గుండెలు పిండేస్తున్నాయి. తన తల్లి తమను వదిలేసి ఏదో ఊరికి వెళ్లిందని, ఇక రాదని అమాయకంగా చెబుతుంటే మనసు చలించిపోతుంది. 'మా అమ్మ ఊరికి వెళ్లింది. ఇక రాదంటా. ఎందుకెళ్లిందో చెప్పలేదు. ప్రతీరోజు నాకు, అన్నయ్యకు అన్నం తినిపించేది. బాగా చదువుకోవాలని చెప్పేది. స్కూల్‌కి, ట్యూషన్‌కి తప్పకుండా వెళ్లాలని చెప్పింది. మా అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు. నెల రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్‌కు వెళ్తాం. కలిసి ఆడుకుంటాం. రోజు అన్నయ్య దగ్గరకు వెళ్తున్నా. అన్నయ్య రాగానే స్కూల్ వెళ్తాం. అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం లేదు. అంటూ శాన్వితా అమాయకంగా చెబుతుంటే దుఃఖం తన్నుకొస్తోంది. నాని తగ్గేదేలేదంటూ సినిమాకు: నానమ్మ ఇక తన ముద్దుల మనుమడు శ్రీతేజ్ గురించి చెబుతూ భాస్కర్ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది. సినిమాకు వెళ్లేరోజు కొత్త బట్టలు, కొత్త బూట్లు వేసుకున్న తన మనుమడు.. 'తగ్గేదేలేదు' అంటూ సంబరపడిపోయాడని కన్నీటి పర్యంతమవుతోంది. 'నాని.. సినిమా చూసివచ్చిన తర్వాత మళ్లీ డ్యాన్స్ చేస్తానన్నాడు. ఆ సినిమా నా పిల్లల ప్రాణాలు తీసేందుకే వచ్చింది. ఆ దేవుడు నన్ను తీసుకుపోతే బాగుండు. నా పిల్లలను గోసపెడుతున్నాడు. పసి పాప శాన్వితాను చూస్తే దుఃఖం ఆగుతలేదు. పసిగుడ్డును ఎలా పెంచేది. తల్లికోసం బిత్తరపోయి చూస్తోంది. ఒక్కతే కూర్చుంటోంది. ఎదురైన వాళ్లను అన్నా, అమ్మా ఎప్పుడొస్తారని అడుగుతోంది' అంటూ ఆ పెద్దావిడ రోదిస్తున్న తీరు మనసును మెలిపెడుతోంది. అందరిమధ్య నలిగిపోతున్న భాస్కర్.. ఇప్పటికే తీరని నష్టంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితుడు భాస్కర్ ఇరువర్గాల మధ్య నలిగిపోతున్నాడనేది నగ్న సత్యం. భార్యను కోల్పోయి, కొడుకు బతికివస్తాడో లేదో తెలియక, పసికూతురుకు చెప్పలేక లోలోపల కుమిలిపోతున్న భాస్కర్ ఇరువర్గాలనుంచి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. వారికి నచ్చ చెప్పలేక చితికిపోతున్నాడు. ఈ ఘటనతో అల్లు అర్జున్ కు సంబంధం లేదని, కేసులు పెట్టి అతన్ని అనవసరంగా వేధించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఇష్యూను చాలా సీరియస్ గా తీసుకుంటోంది. పోలీసులు వద్దని చెప్పినా వినకుండా థియేటర్ కు రావడం, చట్టవిరుద్ధంగా నడుచుకోవడంపై బన్నీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇక అసెంబ్లీలోనూ ఈ ఘటనపై సీఎం రేవంత్ పూసగుచ్చినట్లు వివరించడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో బన్నీని ఇరికించలేక, ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించలేక భాస్కర్ సతమతమవుతున్నాడు. అల్లు అర్జున్ ఫ్యామిలీ, 'పుష్ప' సినిమా దర్శక నిర్మాతలు తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భాస్కర్ చెబుతున్నాడు. కాబట్టి ఇంతటితో అర్జున్ ను వదిలేయాలని కోరుతున్నాడు. కానీ బాధితుడిని పరామర్శించాల్సిన సినీ సెలబ్రిటీలు అర్జున్ ఇంటికి క్యూ కట్టడంపై సీఎం రేవంత్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. మొత్తంగా ఈ ఇష్యూను ఇంతటితో ముగిస్తారా? లేదంటే రేవంత్ సర్కార్ బన్నీని మరోసారి జైలుపాలు చేస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మీడియాతో మాట్లాడుతున్న శ్రీతేజ్ తండ్రి తెలుగోని సత్తా చాటడమంటే ఇలా కాదని.. సంధ్య థియేటర్ తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు సానుభూతి చూపించాలంటూ పలువురు మండిపడుతున్నారు. పశ్చాత్తాపంతో ప్రెస్‌మీట్ పెట్టారని అనుకున్నామని.. కానీ బన్నీ అందుకు విరుద్దంగా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదంటున్నారు. ఈ నేపథ్యంలో "#alluarjunarrested" అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు నెటిజెన్లు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పుష్పా 2 నిర్మాతలతో కలిసి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. నిర్మాతలు 50 లక్షల చెక్కును శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు. pic.twitter.com/mJe9cxXMNb — Indian Clicks (@IndianClicks) December 23, 2024 అసలేం జరిగిందంటే.. డిసెంబర్ 4న 'పుష్ప2' బెన్ ఫిట్ షో కోసం రేవతి కుటుంబం (భాస్కర్, రేవతి, శ్రీతేజ్, శాన్వితా) సంధ్య ధియేటర్‌కు వచ్చింది. అదే సమయానికి అల్లు అర్జున్ రావటంతో అతన్ని చూడటానికి జనాలు ఎగబడ్డారు. దీంతో థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడంతో రేవతి, ఆమె తనయుడు శ్రీతేజ్ గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. సృహ కోల్పోయిన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడు.