TG News: తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఇష్యూ ప్రకంపనలు రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ పుష్ప రాజ్ అనే రేంజ్‌లో నడుస్తోంది. పోలీసులు చెప్పిన వినకుండా సంథ్య థియేటర్ కు వచ్చాడని అసెంబ్లీలో సీఎం చెప్పగా.. దానికి కౌంటర్ గా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. ఈ తరుణంలో తెలంగాణ గవర్నమెంట్, టాలీవుడ్ మధ్య వివాదం ముదురుతోంది. అంతేకాదు ఈ ఘటనపై ఏసీపీ, డీజీపీలు కూడా తీవ్రంగా మండిపడ్డారు. నటుడు బన్నీ వ్యాఖ్యలు పోలీసులను అవమానించే విధంగా ఉన్నాయంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వస్తే ఘనంగా స్వాగతిస్తాం.. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందంటూ మరో చర్చను లేవనెత్తారు. ఇండస్ట్రీ ఏపీకి రావాలని, వారు వస్తే తాము ఘనంగా స్వాగతిస్తామని చెప్పారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన కూడా చెప్పారు. అంతేకాదు పవన్ కల్యాణ్ కూడా ఇండస్ట్రీ ఏపీకి రావాలని కోరుతున్నారని, స్వయంగా అధికారులతో చర్చించినట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి షిఫ్ట్ కాబోతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ మాజీ సీఎం జగన్ కూడా విశాఖపట్నంకు సినీ ఇండస్ట్రీ తరలిరావాలని కోరిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు పవన్ కూడా అదే తరహాలో ఏపీకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిని హైదరాబాద్ కు ధీటుగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాల సాయం కావాలని, ఇందులో సినిమావాళ్ల పాత్ర కూడా అవసరం ఉందంటూ సీఎం చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు సమాచారం.