/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జపాన్‌లో మోహరించిన అత్యాధునిక యుద్ధనౌక USS త్రిపోలిని సుమారు 2,500 మంది శక్తివంతమైన మెరైన్ సైనికులతో కలిపి పశ్చిమ ఆసియాకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో USS అబ్రహం లింకన్, USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి భారీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నప్పటికీ, త్రిపోలిని ప్రత్యేకంగా పంపడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నిజానికి అబ్రహం లింకన్, జెరాల్డ్ ఫోర్డ్ వంటి నౌకలు ప్రధానంగా గగనతల దాడులకు ఉపయోగపడతాయి. శత్రువుల స్థావరాలపై ఫైటర్ జెట్లతో బాంబుల వర్షం కురిపించడం, క్షిపణి దాడులను అడ్డుకోవడం వీటి ప్రధాన పని. కానీ, USS త్రిపోలి శైలి వేరు. ఇది సముద్రం ద్వారా భారీ ఎత్తున సైనికులను, హెలికాప్టర్లను, యుద్ధ ట్యాంకులను నేరుగా శత్రువుల తీర ప్రాంతాలకు చేరవేయగలదు. అంటే, కేవలం గాల్లో నుంచి దాడులు చేయడం మాత్రమే కాకుండా, అవసరమైతే నేరుగా భూమి మీదకు సైన్యాన్ని దింపి ఆపరేషన్లు చేయడానికి ఇది అమెరికాకు ఒక బలమైన ఆయుధంగా మారుతుంది.
ఇరాన్ తన పట్టు బిగించాలని
హోర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో ఇరాన్ తన పట్టు బిగించాలని చూస్తున్న వేళ, త్రిపోలి రాకతో అమెరికాకు మరిన్ని సైనిక అవకాశాలు దొరుకుతాయి. సముద్ర తీరాల్లోని ఇరాన్ సైనిక స్థావరాలపై నిఘా పెట్టడమే కాకుండా, పరిమిత స్థాయిలో భూతల దాడులు చేయడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు విఫలమయ్యాయని కాదు గానీ, యుద్ధంలో కొత్త తరహా బలాన్ని జోడించడమే ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది.
ప్రస్తుతానికి ఇరాన్‌పై పూర్తి స్థాయి భూతల దాడి చేస్తామని అమెరికా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, మరీన్ సైనికులతో కూడిన ఈ యుద్ధనౌకను పంపడం ద్వారా ట్రంప్ ఒక స్పష్టమైన హెచ్చరిక పంపారు. కేవలం క్షిపణులు, డ్రోన్లతోనే కాకుండా, అవసరమైతే తమ సైనికులు ఇరాన్ తీరాల్లో అడుగుపెట్టడానికి కూడా వెనకాడబోరని ఈ చర్య సూచిస్తోంది. ముఖ్యంగా రాయబార కార్యాలయాల రక్షణకు లేదా అత్యవసర పరిస్థితుల్లో సైనిక ఆపరేషన్లకు ఈ నౌక అత్యంత కీలకం కానుంది.
Follow Us