Iran VS US-Israel War: 23వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌కు భారీ నష్టం..

మిడిల్‌ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం 23వ రోజుకి చేరింది. ఈ యుద్ధం వల్ల ఆయా దేశాల్లో కేవలం సైనికపరంగా కాకుండా ఆర్థికంగా భారీ ప్రభావం చూపిస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇప్పటిదాకా ఎంత నష్టం జరిగిందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.     

New Update
Middle East War Enters Day 23 Massive Economic Losses for the U.S., Israel, Iran, and Global Markets

Middle East War Enters Day 23 Massive Economic Losses for the U.S., Israel, Iran, and Global Markets

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి నుంచి ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం సోమవారం నాటికి 23వ రోజుకి చేరింది. ఇన్ని రోజులుగా కొనసాగుతున్న ఆ యుద్ధం వల్ల ఆయా దేశాల్లో కేవలం సైనికపరంగా కాకుండా ఆర్థికంగా భారీ ప్రభావం చూపిస్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇప్పటిదాకా ఎంత నష్టం జరిగిందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.     

అమెరికాకు రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టం 

ఈ యుద్ధంలో అమెరికా అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశంగా నిలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన మొదటి ఆరు రోజుల్లోనే సుమారు 11.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.93,000 కోట్లు) ఖర్చు అయింది. ఇక 12వ రోజు నాటికి 16.5 బిలియన్ డాలర్లు (రూ.1.3 లక్షల కోట్లు) దాటినట్లు అంచనా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం రోజుకు బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 23 రోజులు చూసుకుంటే అమెరికాకు ఈ యుద్ధంలో దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇజ్రాయెల్‌కు వారానికి వేల కోట్ల నష్టం

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌ ఆర్థిక వ్యవస్థకు కూడా గట్టి దెబ్బే తగిలింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వారానికి సుమారు 3 బిలియన్ డాలర్లు (రూ.25 వేల కోట్లు) నష్టపోతోంది. అంటే మూడు వారాల్లోనే దాదాపు రూ.75 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. రిజర్వ్ సైనిక దళాల మొబిలైజేషన్, విద్యాసంస్థలను మూసివేయడం, వ్యాపార కార్యకలాపాల మందగించడం వంటి అంశాలు కూడా దీని ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. 

Also Read: పర్షియన్ గల్ఫ్ అంతటా సీమైన్స్ పెడతాం.. ఇరాన్ సంచలన హెచ్చరిక

ఇరాన్‌ మౌలిక సదుపాయాలకు భారీ నష్టం

ఈ యుద్ధంలో ఇరాన్‌కు సంబంధించిన నష్టం సంఖ్యలుగా పూర్తిగా బయటకు రాలేకపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఆ దేశంలో క్షిపణి లాంచర్లు, రాడార్లు, నౌకలు వంటి సైనిక సామగ్రి భారీ ఎత్తున ధ్వంసం అయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం దాదాపు 60 శాతం రాకెట్ లాంచర్లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై అలాగే దౌత్య కార్యాలయాలు, చమురు, గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ పెద్దఎత్తున కాల్పులు జరిపాయి. ఈ 23 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్‌కు కూడా లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

భారత్‌పై ఎఫెక్ట్ 

మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న ఈ యుద్ధం వల్ల చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిపోయాయి. దీంతో రోజుకు 11 మిలియన్ బ్యారెల్స్‌ ఆయిల్ సరఫరా తగ్గింది. భారత స్టాక్ మార్కెట్‌లో చూసుకుంటే ఒక్కరోజులోనే రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. సెన్సెక్స్ 1400 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా భారీగా క్షీణించింది. మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు 11 బిలియన్ డాలర్లు (రూ.90,000 కోట్లకు పైగా) వెనక్కి తీసుకోవడంతో భారత్‌పై కూడా ఆర్థిక నష్టం జరిగింది. 

వెనక్కి తగ్గిన ట్రంప్.. 5 రోజులు యుద్ధం నిలిపివేత 

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై 5 రోజుల పాటు ఎలాంటి దాడులు చేయమన్నారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. గత రెండ్రోజులుగా ఆయన ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌళిక సదుపాయాలపై జరపాల్సిన సైనిక దాడులు 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. జరుగుతున్న చర్చల విజయంపై భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: F-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ ఎలా దెబ్బతీసిందో తెలుసా.. వెలుగులోకి సంచలన నిజాలు

ట్రంప్ .. యుద్ధాన్ని తాత్కాలిక నిలిపివేసిన ప్రకటనపై ఇరాన్ కూడా స్పందించింది. తాము హెచ్చరించడంతోనే ఆయన దిగొచ్చారని తెలిపింది. అమెరికా తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తామని ఇటీవల ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే ఇజ్రాయెల్‌కు చెందిన విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. తమ హెచ్చరికల వల్లే ట్రంప్ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గారని ఇరాన్ ప్రకటించింది. 

Advertisment
తాజా కథనాలు